పార్టీల పేర్లే మారింది.. బుద్ధి కాదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ప్రధాని మోడీ ఫైర్

అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చిందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు.

Advertisement
Update:2023-11-25 18:21 IST

యూపీఏ ఇండియా కూటమిగా మారిందని, టీఆర్ఎస్ ఉన్నట్టుండి బీఆర్ఎస్‌గా మారిందని.. అయితే మారింది పార్టీల పేర్లే అని.. బుద్ధి కాదని..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇవాళ కామారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ప్రధాని చెప్పారు. ఆ పార్టీ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలన్నారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని, ఒకసారి వాగ్దానం ఇచ్చామంటే అది అమలై తీరుతుందని తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన యూనివర్సిటీ హామీని నిలబెట్టుకున్నామని ప్రధాని వివరించారు.

బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించామని చెప్పారు. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని కేసీఆర్ ప్రకటించారని, అయితే ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పామని.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టులు అవినీతిమయం అయ్యాయని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన డబ్బు బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు.

పేపర్ లీకేజీతో నిరుద్యోగ యువతను బీఆర్ఎస్ దగా చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారి పిల్లల భవిష్యత్తు కోసం చూసుకుంటున్నాయని, బీజేపీ మాత్రం రాష్ట్ర‌ ప్రజల పిల్లల బాగు కోసం ఆలోచిస్తోందని ప్రధాని చెప్పారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చిందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు.


Tags:    
Advertisement

Similar News