పెట్రోల్ రేట్లపై మోదీ సెల్ఫ్ గోల్
తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతుందని మహబూబాబాద్ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు ప్రధాని మోదీ. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తెలంగాణను నాశనం చేశాయని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వంపై సామాన్యుడు రగిలిపోతున్నాడు. దానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు తగ్గినా కూడా దేశంలో మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచి తమాషా చూశారు. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆ పాప పరిహారం కోసం మోదీ కొత్త పల్లవి అందుకున్నారు. తెలంగాణలో స్థానిక పన్నులతో పెట్రోల్ రేట్లు పెరిగాయని, తాము అధికారంలోకి వస్తే వాటిని తగ్గిస్తామంటున్నారు. పరోక్షంగా ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఎన్నికల వేళ, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన వాతను మరోసారి గుర్తు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు మోదీ.
తెలగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కరీంనగర్ సభలో ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. బీజేపీ ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని, తెలంగాణలో కూడా బీజేపీ సర్కారు వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. తాను ఎయిర్ పోర్ట్ కి వస్తే కేసీఆర్ రాకుండా తప్పించుకునేవారని చెప్పారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తవుతుందని, డిసెంబర్ 3 తర్వాత లిక్కర్ స్కాంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పారు.
తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతుందని మహబూబాబాద్ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు ప్రధాని మోదీ. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తెలంగాణను నాశనం చేశాయని ఆరోపించారు. బీజేపీతో ఎలాగైనా దోస్తీ చేయాలని కేసీఆర్ ఢిల్లీకి వచ్చారని, కానీ బీజేపీ ఎప్పుడూ బీఆర్ఎస్ ని దగ్గరకు రానివ్వదని చెప్పారు. ఎన్డీయేలో చేర్చుకోకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు తనను తిట్టడం మొదలుపెట్టారన్నారు. తెలంగాణను మూఢ నమ్మకాల రాష్ట్రంగా మార్చారని, ఆ మూఢ నమ్మకాలతోనే సచివాలయాన్ని నాశనం చేశారని చెప్పారు. అణగారిన వర్గాలకు బీజేపీనే సంక్షేమం అందిస్తోందని, తెలంగాణలో కొమురం భీమ్ మ్యూజియం రెడీ అవుతోందని చెప్పారు మోదీ.
♦