కాంగ్రెస్‌కు విష్ణు రాజీనామా.. BRS అభ్యర్థిగా గోషామహల్ బరిలో.!
25 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నందుకు ఆవేదనగా ఉందన్నారు. 2008లో పీజేఆర్ మరణంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచానని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ఈ మేరకు సోమవారం AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రెండు పేజీల లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రస్తావించిన విష్ణు.. 25 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నందుకు ఆవేదనగా ఉందన్నారు. 2008లో పీజేఆర్ మరణంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచానని గుర్తుచేశారు. 2014లో జూబ్లిహిల్స్ స్థానం నుంచి మరోసారి విజయం సాధించానన్నారు విష్ణు. అయితే 2014లో MIM, బీజేపీ కుట్ర చేసి తనను ఓడించాయన్నారు. 2018లోనూ చాలా స్వల్ప తేడాతో ఓడిపోయానని లేఖలో వివరించారు.
ఓడిపోయినప్పటికీ.. నియోజకవర్గంలో పార్టీని బ్రతికించుకున్నానని, కార్యకర్తలకు అండగా ఉన్నానన్నారు విష్ణు. ఈసారి తనకు టికెట్ నిరాకరించడం బాధించిందన్నారు. వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అజారుద్దీన్‌కు పార్టీ టికెట్ కేటాయించిందని, ఇదంతా తనపై కుట్రలో భాగంగానే జరిగిందని లేఖలో ఆరోపించారు విష్ణు. కార్యకర్తల అభీష్టం మేరకు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు లేఖలో స్ఫష్టం చేశారు.
అయితే విష్ణువర్ధన్ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. మంత్రి హరీష్ రావు ఇప్పటికే విష్ణు నివాసానికి వెళ్లి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. తర్వాత విష్ణు సైతం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో విష్ణును గోషామహల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలో దించనుందనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటివరకూ గోషామహల్ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించలేదు. గడిచిన రెండు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. దీంతో ఈ సారి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని బరిలో ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది. కాగా, విష్ణు అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.