పాలమూరు జిల్లాకే ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వలస వస్తున్నారు : సీఎం కేసీఆర్

ఒకనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో కష్టాలు ఉండేది. ఆర్టీఎస్ కాల్వ ద్వారా మనకు నీళ్లు రావల్సి ఉండగా.. దాన్ని మనకు కాకుండా ఉమ్మడి ఏపీలోని నాయకులు గద్దల్లా తన్నుకొని పోయారు.

Advertisement
Update:2023-06-12 19:27 IST

పాలమూరు జిల్లా అంటేనే ఒకప్పుడు కరువుకు మరో పేరుగా ఉండేది. పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు ఉండేవి. ఒకప్పుడు ఇక్కడి నుంచి వలసలు ఎక్కువగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు పక్కనున్న కర్నూలు, రాయ్‌చూర్‌తో పాటు బీహార్, యూపీ నుంచి పనుల కోసం వలస వస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం గద్వాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..

ఒకనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో కష్టాలు ఉండేది. ఆర్టీఎస్ కాల్వ ద్వారా మనకు నీళ్లు రావల్సి ఉండగా.. దాన్ని మనకు కాకుండా ఉమ్మడి ఏపీలోని నాయకులు గద్దల్లా తన్నుకొని పోయారు. ఆ సమయంలో మొదటి సారి పాదయాత్ర చేపట్టింది తానేనని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ తల్లికి దండం పెట్టి గద్వాల వరకు పాదయాత్ర చేశాను. ఆర్డీఎస్ మనకే దక్కాలని ఆ రోజు నేను చేసిన పోరాటానికి ఎంతో మద్దతు లభించిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆలంపూర్, నడిగడ్డలో పర్యటించాను. అప్పట్లో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనపడితే.. కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ సాధించుకున్న తర్వాత పరిపాలనలో సంస్కరణలు తెచ్చుకున్నాము. ఈ క్రమంలోనే జిల్లా ప్రజలు బాగుండాలని గద్వాల జిల్లాను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా.. దీనికి జోగులాంబ గద్వాల అని పేరు పెట్టుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. నెట్టెంపాడు, బీమా ద్వారా త్వరలోనే సాగు నీరు అందుతుంది. అందుకు సంబంధించిన పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతీ ఒక్కరికి సహాయం అందేలా ఆదుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు. గురుకల పాఠశాలల్లో గిరిజన, దళిత, బీసీ బిడ్డలు చాలా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. మన పిల్లల చదువు కోసం జూనియర్ కాలేజీలు ప్రారంభించుకున్నాము. ఇదంతా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం వల్లే సాకారమైందని సీఎం కేసీఆర్ అన్నారు.

గద్వాల నుంచి మంత్రులు అయిన వారు ఏనాడూ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. వారి కాలంలో ఒక్క పని కూడా జరగలేదు. పాలమూరులో ఎన్నో సమస్యలు నెలకొని ఉండేవి. మహబూబ్‌నగర్‌లో అయితే 14 రోజులకు ఒకనాడు నీళ్లు దొరికేవి. నా కంటే దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు మంత్రులు అయినా చేసింది ఏమీ లేదని కేసీఆర్ విమర్శించారు. కానీ ఇవాళ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇంటింటికీ అందిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకం లేదని సీఎం చెప్పారు.

కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. దీంతో ఎంతో మందికి లబ్ది చేకూరుతోందని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు రాదు అని ఎద్దేవా చేశారు. ఈ రోజు తుంగభద్ర బ్రిడ్జి దాటితే ఉన్న రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదని కేసీఆర్ చెప్పారు. పాలమూరు జిల్లాలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గద్వాల జిల్లాలోని ప్రతీ పంచాయతీకి రూ.10 లక్షలు, గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

అంతకు ముందు సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఎస్పీ ఆఫీసును ప్రారంభించారు. బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News