దుర్మార్గమైన రాష్ట్ర వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు :కేటీఆర్
తెలంగాణ శాసన సభలో అరాచక, దుర్మార్గమైన రాష్ట్ర వైఖరినీ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ శాసన సభలో అరాచక, దుర్మార్గమైన రాష్ట్ర వైఖరినీ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యాటకం, ప్రజలను జైలులో పెట్టడం మాత్రమే చేస్తున్నాడని అన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.. భూములు ఇవ్వని పాపానికి దళిత, బలహీనవర్గాల రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. భూములు ఇవ్వమన్న రైతులపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శాసన సభలో చర్చించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. దీంతో అసెంబ్లీకి లోపలికి వెళ్లే దారిలో కూర్చుని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. లగచర్ల అంశంపై చర్చించరట కానీ.. పర్యాటకంపై చర్చిస్తామంటున్నారని మండిపడ్డారు.లగచర్ల రైతులు ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
ఓ రైతుకు గుండెపోటు వస్తే బేడీలతో ట్రీట్‌మెంట్ చేయించారని పేర్కొన్నారు. కొడంగల్ నీ జాగీరా.. రైతుల భూములు గుంజుకుంటారా అని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు చేసినా రైతుల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. ఆదానీతో రేవంత్ దోస్తీని నిలదీయాలని టీషర్టులతో వస్తే లోనికి వెళ్లనీయలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల అంశంపై చర్చించాలని పట్టుబట్టినా చర్చ పెట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. న్యాయం జరిగేదాకా పోరాడుతామని.. లగచర్ల రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దన్నదని తెలిపారు. రైతులకు రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రూపాయి తెచ్చింది లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినా జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది అరాచక ప్రభుత్వమా? ప్రజాస్వామ్య ప్రభుత్వమా అని కేటీఆర్ నిలదీశారు. రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.