పెండింగ్ చలానా కడుతున్నారా..? ఒక్క నిమిషం ఆగండి..

చలానా డబ్బు కట్టిన వెంటనే.. నగదు జమ అయినట్టు మరో ఫేక్ మెసేజ్ కూడా మనకి వస్తుంది. అంటే మనం మోసపోయామనే విషయం మనకు తెలిసే అవకాశమే లేదు.

Advertisement
Update:2024-01-03 09:07 IST

పెండింగ్ చలానాలు కడితే రాయితీ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగానే చాలామంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే చిన్న సమస్య ఉంది. పెండింగ్ చలానా ఆన్ లైన్ లో కట్టినవారికి, కట్టాలనుకుంటున్నవారికి పోలీసులు ఓ అలర్ట్ మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పటికే చలానా కట్టినవారు నిజంగానే ఆ డబ్బులు ప్రభుత్వానికి జమ అయ్యాయా, లేక కేటుగాళ్లు మధ్యలో మాయం చేసారా అనేది తేల్చుకోవాల్సి ఉంది. ఇక కొత్తగా కట్టేవారు మాత్రం మోసపోకుండా ఉండాలంటే https://echallan.tspolice.gov.in/publicview/ ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.

బీ అలర్ట్..

సైబర్ నేరాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతున్నాయో ఎవరికీ తెలియదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకోడానికి కూడా ఆన్ లైన్ లో ఏమీ ఉండదు. తాజాగా పెండింగ్ చలాన్ల విషయంలో కూడా ఇలాంటి మోసాలు మొదలయ్యాయి. సైబర్ కేటుగాళ్లు ఒక్క అక్షరం మార్పుతో కొత్త వెబ్ సైట్లు సృష్టించి చలాన్ డబ్బులు వసూలు చేస్తున్నారు. పొరపాటున ఫేక్ వెబ్ సైట్ లో చలానా కట్టినా అది ప్రభుత్వానికి చేరదు. అంటే మన వాహనంపై ఉన్న చలానా పెండింగ్ లోనే ఉంటుంది.

మోసం ఇలా..

కేవలం ఒకటి లేదా రెండు అక్షరాలు మార్చి నకిలీ వెబ్‌ సైట్‌ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొంతమంది సెల్‌ ఫోన్లకు నేరుగా మెసేజ్ లు పంపిస్తున్నారు. ఆ మెసేజ్ లో ఉన్న లింకు ఓపెన్ చేసి చలానా కడితే మనం మోసపోయినట్టే లెక్క. చలానా డబ్బు కట్టిన వెంటనే.. నగదు జమ అయినట్టు మరో ఫేక్ మెసేజ్ కూడా మనకి వస్తుంది. అంటే మనం మోసపోయామనే విషయం మనకు తెలిసే అవకాశమే లేదు. ఆ తర్వాత ఎవరైనా అసలు వెబ్‌ సైట్‌ లో పరిశీలిస్తే మాత్రం చలానాలు పెండింగ్ లోనే ఉంటాయి. కొంతమంది ఇలాంటి అనుభవాలతో తిరిగి పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు.

తప్పించుకోవడం ఎలా..?

పెండింగ్ చలానాలు కట్టే సమయంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ అవగాహన లేకపోతే మీ-సేవ కేంద్రాలు, పేటీఎం వాలెట్‌ ని ఉపయోగించుకోవాలి. https://echallan.tspolice.gov.in/publicview/ ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలని సూచిస్తున్నారు తెలంగాణ పోలీసులు. 

Tags:    
Advertisement

Similar News