సీనియర్లనూ వదలం.. రేవంత్ మార్క్ రాజకీయం

ఓవైపు ఎంపీ సీట్ల కేటాయింపు, మరోవైపు నామినేటెడ్‌ పోస్టుల చిచ్చు అధికార కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కనీసం 12 లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న పార్టీ పెద్దల్లో ఆందోళన మొదలైంది.

Advertisement
Update:2024-03-25 15:16 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 3 నెలలు తిరక్కుండానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల టికెట్లను ప్యారాచుట్‌ నేతలకు కేటాయించడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. మొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయగా, నిన్న వీ.హనుమంతరావు రేవంత్‌ తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. అలా పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బట్టబయలైంది. దీంతో ముదురుతున్న అసమ్మతిని మొగ్గ దశలోనే తుంచేసేందుకు టీపీసీసీ అలర్ట్ అయింది. అసమ్మతి నేతలు గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లు పెట్టకుండా కట్టడి చర్యలు చేపట్టింది. తాజాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత సీనియర్‌ అయినా చర్యలు తప్పవని హెచ్చరించింది.

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గంగా తెలియజేయాలన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సీనియర్లయినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

ఓవైపు ఎంపీ సీట్ల కేటాయింపు, మరోవైపు నామినేటెడ్‌ పోస్టుల చిచ్చు అధికార కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కనీసం 12 లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న పార్టీ పెద్దల్లో ఆందోళన మొదలైంది. దశాబ్దం తర్వాత అధికారం దక్కడంతో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నాయకులంతా తమకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రానప్పటికీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా పోటీచేసే అవకాశం దక్కుతుందని భావించారు. కానీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి సీనియర్లకు మింగుడు పడటం లేదు. మొన్నటిదాకా అధికారాన్ని అనుభవించిన నాయకులను అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొందరు నేతలు బాహాటంగానే కాంగ్రెస్‌ నాయకత్వ వైఖరిని తూర్పారబడుతున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి ఎంపీ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల్లో కూడా వణుకు మొదలైంది. తమ విజయానికి పార్టీ క్యాడర్‌ సహకరిస్తుందా? లేదా? అని అనుమానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News