మోదీ సభకు పవన్ కల్యాణ్..
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, మోదీ మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు పవన్ కల్యాణ్. ప్రధాని పాల్గొనే బీసీ సభకు తనను ఆహ్వానించారని, తాను ఆ సభకు హాజరవుతానని చెప్పారు.
ఈనెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ సభకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సభకు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పవన్ ను ఆహ్వానించారని.. తెలిపింది. తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన బీజేపీ.. హైదరాబాద్ లో బీసీ సభతో మరింత హీట్ పెంచుతోంది. ఈ సభకు ఇప్పుడు పవన్ కల్యాణ్ హాజరు కాబోతుండటం విశేషం.
తెలంగాణలో పొత్తులు..
తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల పంపకాల్లో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై మరోసారి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి మధ్య చర్చలు జరిగాయి. లక్ష్మణ్, నాదెండ్ల మనోహర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని, ఆ తర్వాత బీజేపీతో చర్చలు మొదలు పెట్టామని చెప్పారు పవన్ కల్యాణ్. తాము పోటీ చేయబోయే స్థానాలు ఫైనల్ అయ్యాయని, ఇంకా రెండు స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.
మోదీ హ్యాట్రిక్ కొట్టాలి..
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, మోదీ మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు పవన్ కల్యాణ్. ప్రధాని పాల్గొనే బీసీ సభకు తనను ఆహ్వానించారని, తాను ఆ సభకు హాజరవుతానని చెప్పారు. పవన్ కల్యాణ్ మీటింగ్ పై కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు జనసేన సపోర్ట్ కలసి వచ్చిందని, ఈ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే ముందుకెళ్తాయని అన్నారు.