పవన్ రోడ్ షో.. పట్టించుకున్నదెవరు..?
పవన్ ప్రసంగాలన్నీ చల్లగా చప్పగా సాగాయి. అందుకే చివరి రోజు రోడ్ షో ని కూడా జనం లైట్ తీసుకున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి రోజున పవన్ కల్యాణ్. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించారు. జనం తరలి వచ్చారు, రోడ్లపై గుమికూడారు, పవన్ కి అభివాదాలు తెలుపుతూ రోడ్లన్నీ కిక్కిరిసాయంటూ జనసేన సోషల్ మీడియా విభాగం ఊదరగొట్టింది కానీ, పవన్ ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు పట్టించుకోలేదు. అసలు పవన్ రోడ్ షో ఉన్నట్టు కూకట్ పల్లి వాసులకు కూడా చాలామందికి తెలియదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో బీజేపీనే ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇక జనసేన సంగతి ఊహించ వచ్చు. తెలంగాణలో జనసేనను ప్రధాన పార్టీలన్నీ ఆటలో అరటిపండులా తీసేశాయి. వరంగల్ సభలోనే పవన్ ప్రసంగంలోని పస తెలిసిపోయింది. తమ కోసం సభలు, సమావేశాలకు పవన్ వచ్చినా ఆయన వల్ల ఉపయోగం లేదని అభ్యర్థులు కూడా డిసైడ్ అయ్యారు. అందుకే జనసేన నేతలు కూడా పవన్ పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రచారం చివరి రోజు అలా మెరిసి మాయం అవ్వాలనుకున్నారు పవన్. అందుకే కూకట్ పల్లి వచ్చారు. బాలా నగర్ చౌరాస్తా నుంచి హస్మత్ పేట వరకు రోడ్ షో నిర్వహించారు.
తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని, ఆ ప్రభావం ఏపీపై కూడా పడుతుందనే ఉద్దేశంతో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పోటీకి సై అన్నారు. అభ్యర్థుల్ని ప్రకటించి, చివరకు బీజేపీ ఇచ్చిన లిస్ట్ తో సర్దుకున్నారు. పోనీ అక్కడయినా ప్రచారానికి వెళ్లారా, ప్రభుత్వాన్ని విమర్శించారా అంటే.. అదీ లేదు. పవన్ ప్రసంగాలన్నీ చల్లగా చప్పగా సాగాయి. అందుకే చివరి రోజు రోడ్ షో ని కూడా జనం లైట్ తీసుకున్నారు.