నేను రావాలా..? నా కటౌట్ చాలదా..?

పవన్ ప్రచారానికి వచ్చినా కూడా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదంటే అది మరింత అవమానం. ఆ ప్రభావం ఏపీలో కూడా కనపడుతుందనే అనుమానాలున్నాయి. అందుకే పవన్ ప్రచారానికి వెకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2023-11-21 09:33 IST

"కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు" అనే డైలాగ్ పవన్ కల్యాణ్ సినిమాలోదే. అయితే రాజకీయాల్లో ఇలాంటి డైలాగులతో ఓట్లు పడవు. ఈ విషయం తెలిసినా కూడా ఎందుకో పవన్ తెలంగాణ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టలేదు. సొంతగా 32 స్థానాల్లో పోటీ చేస్తామంటూ అప్పట్లో హడావిడి చేసిన పవన్, ఆ తర్వాత బీజేపీతో సర్దుకుపోయి కేవలం 8 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టారు. తీరా ఇప్పుడు ఆ 8 నియోజకవర్గాల్లో ప్రచారానికి కూడా ఆయనకు తీరిక దొరకడంలేదు. ఇలా అయితే తెలంగాణలో పార్టీని నడిపేదెలా అనే ప్రశ్నలు వినపడుతున్న వేళ, పవన్ ప్రచారానికి రెండు రోజుల సమయం కేటాయించడం ఆసక్తికర అంశం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను జనసేన.. ముఖ్యంగా జనసేనాని లైట్ తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. అందులోనూ ఆ పార్టీకి ఉమ్మడి గుర్తు కూడా లేకపోవడంతో అభ్యర్థులు మరింత నిరాశచెందారు. అంటే వారిప్పుడు స్వతంత్ర అభ్యర్థుల కేటగిరీలోనే బరిలో ఉంటారు. పవన్ ప్రచారానికి వచ్చినా కూడా గాజు గ్లాస్ గుర్తు అని చెప్పుకోలేని పరిస్థితి. పోనీ ఆ 8 నియోజకవర్గాల్లో జనసేనకు కనీసం రెండో స్థానం అయినా దక్కుతుందా అంటే అనుమానమేననే సమాధానం వినపడుతోంది. డిపాజిట్లు దక్కడమే గొప్ప అంటున్నారు. పవన్ ప్రచారానికి వచ్చినా కూడా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదంటే అది మరింత అవమానం. ఆ ప్రభావం ఏపీలో కూడా కనపడుతుందనే అనుమానాలున్నాయి. అందుకే పవన్ ప్రచారానికి వెకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

రెండు రోజులు.. రెండు సభలు

పోనీ పవన్ ప్రచారానికి పూర్తిగా డుమ్మా కొట్టడం కూడా ప్రమాదమే. అందుకే ఆయన రెండు రోజులు ప్రచారానికి కేటాయించారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. 25న తాండూర్‌ లో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్‌ కు మద్దతుగా ప్రచారం చేస్తారు పవన్. 26న కూకట్‌ పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తరపున పవన్ రోడ్ షో లో పాల్గొంటారు. ఈ రెండు సభలు గ్యారెంటీ అని అంటున్నారు. చివరకు పవన్ మూడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఈ ప్రచారం మొదలవుతుంది.

Tags:    
Advertisement

Similar News