సన్నిహితుడికే షాకిచ్చిన పవన్.. పార్టీలో గందరగోళం?

ఇన్ని సంవత్సరాలుగా పార్టీలోనే పనిచేస్తూ తనకు నీడలా ఉన్న శంకర్ గౌడ్‌నే పవన్ పక్కనపెట్టేయటం మిగిలినవాళ్ళకి కూడా షాకింగ్ గానే ఉంది. శంకర్‌కే టికెట్ విషయంలో దిక్కులేకపోతే ఇక మిగిలినవాళ్ళ పరిస్థితి ఏమిటనే చర్చ పెరిగిపోతోంది.

Advertisement
Update:2023-11-08 09:57 IST

సన్నిహితుడికే షాకిచ్చిన పవన్.. పార్టీలో గందరగోళం?

తనకు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఇన్‌చార్జి, పదేళ్ళుగా పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్న శంకర్ గౌడ్‌కు అధినేత పవన్ కల్యాణ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పవన్ ఇచ్చిన షాక్ ఏమాత్రం ఊహించినది కాకపోవటంతో ఏమి మాట్లాడాలో కూడా శంకర్‌కు అర్థంకావటంలేదట. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో జనసేన పోటీ చేయబోయే ఎనిమిది సీట్లలో కూకట్‌పల్లి కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు.

పవన్ ప్రకటనే గౌడ్‌కు పెద్ద షాకిచ్చింది. కారణం ఏమిటంటే కూకట్‌పల్లిలో పోటీ చేయటానికి శంకర్ గౌడ్ ఆస‌క్తి చూపారు. ఈ మేర‌కు నియోజకవర్గంలో పార్టీ తరపున పాదయాత్ర చేశారు, ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇవికాకుండా పవన్ పుట్టినరోజున‌, సినిమాలు విడుదలైనపుడు ఇలా.. సందర్భం ఏదైనా పెద్దఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలో పోటీ చేయటానికి గౌడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న విషయం కూడా పవన్‌కు తెలుసు. పవన్‌కు అత్యంత సన్నిహితుల్లో శంకర్ కూడా ఒకరు.

ఇలాంటి శంకర్ పక్కనుండగానే పవన్ మాత్రం పార్టీలో కొత్తగా చేరిన ప్రేమ్ కుమార్‌కు టికెట్ ప్రకటించేశారు. పోనీ ప్రేమ్ కుమార్ చాలా కాలంగా పార్టీలో ఉన్నారా అంటే అదీలేదు. అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టిందే రెండు నెలల క్రితం. ముందు బీజేపీలో చేరి రెండు నెలల్లోనే రాజీనామా చేసి నాలుగు రోజుల క్రితమే జనసేనలో చేరారు. చేరిన వెంటనే పవన్ టికెట్ కూడా ప్రకటించేశారు. అంటే పార్టీలో చేరటమే ప్రేమ్ కుమార్ టికెట్ హామీ తీసుకునే చేరినట్లు అర్థ‌మవుతోంది.

ఇన్ని సంవత్సరాలుగా పార్టీలోనే పనిచేస్తూ తనకు నీడలా ఉన్న శంకర్ గౌడ్‌నే పవన్ పక్కనపెట్టేయటం మిగిలినవాళ్ళకి కూడా షాకింగ్ గానే ఉంది. శంకర్‌కే టికెట్ విషయంలో దిక్కులేకపోతే ఇక మిగిలినవాళ్ళ పరిస్థితి ఏమిటనే చర్చ పెరిగిపోతోంది. చివరకు ఏమనుకున్నారో ఏమో శంకర్ గౌడ్‌కు తాండూరులో టికెట్ ఇచ్చారు. ఏమైనా టికెట్ ప్రకటనలో అచ్చంగా చంద్రబాబునే పవన్ ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు టికెట్ల కేటాయింపు కూడా ఇలాగే ఉంటుంది కాబట్టే.


Tags:    
Advertisement

Similar News