చంద్రబాబు, బాలినేనికి పవన్ చేనేత వస్త్ర సవాల్
చేనేత పరిశ్రమకు అండగా నిలవడం కోసం వారంలో ఒక రోజు చేనేత దుస్తులనే ధరించాలని కేటీఆర్ చేసిన ఛాలెంజ్‌ను టీఆర్‌ఎస్ నేతలే కాకుండా మిగిలిన పార్టీల నేతలూ అంగీకరిస్తున్నారు.
చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఛాలెంజ్ కాన్సెప్ట్‌కు అనూహ్య స్పందన వస్తోంది. చేనేత పరిశ్రమకు అండగా నిలవడం కోసం వారంలో ఒక రోజు చేనేత దుస్తులనే ధరించాలని కేటీఆర్ చేసిన ఛాలెంజ్‌ను టీఆర్‌ఎస్ నేతలే కాకుండా మిగిలిన పార్టీల నేతలూ అంగీకరిస్తున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఛాలెంజ్ మొదలైంది.
తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించారు. వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విసిరిన ఛాలెంజ్‌ను పవన్ స్వీకరించారు.. కేటీఆర్ ఛాలెంజ్‌ను తాను అంగీకరిస్తున్నట్టు ట్వీట్ చేశారు పవన్.
చేనేత వస్త్రాలు ధరించాలన్న ఛాలెంజ్‌లో భాగంగా పవన్ కల్యాణ్ కూడా మరో ముగ్గురు నేతలకు ఈ ఛాలెంజ్ చేశారు. అందులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. ఈ ఛాలెంజ్‌కు తాను ఈ ముగ్గురిని ఎంపిక చేస్తున్నానని.. వారు చేనేత దుస్తులు ధరించాలని, ఆ ఫొటోలను షేర్ చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. తాను చేనేత దుస్తులు ధరించిన ఫొటోలను పవన్ కల్యాణ్ షేర్ చేశారు.