పోలీసులు అదుపులో పట్నం నరేందర్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉన్నదనే ఆరోపణలు
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉన్నదనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో ఇప్పటివరకు పోలీసులు 57మందిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి పోలీసులు 16 మందిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో మరికొంతమంది విచారిస్తున్నారు. ఘటన సమయంలో లగచర్లలో ఫోన్‌కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించారు.ఈ ఘటనలో సురేశ్‌ను కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. సురేశ్ హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన తర్వాత పరారీలో ఉన్నాడు. నాలుగు పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి.
రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
లగచర్ల ఘటనలో రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1 భోగమోని సురేశ్ పేరును చేర్చారు. 16 మందిని అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అధికారులపై దాడి, హత్యాయత్నంపై దర్యాప్తు కొనసాగుతున్నదని, దాడిలో కలెక్టర్, అధికారులు, పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు.