కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ టైమింగ్స్‌పై ప్రయాణికుల అసంతృప్తి!

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య 610 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.

Advertisement
Update:2023-09-24 09:35 IST
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ టైమింగ్స్‌పై ప్రయాణికుల అసంతృప్తి!
  • whatsapp icon

దేశంలో రెండు కీలక ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య ఫాస్టెస్ట్ కనెక్టివిటీ కోసం రైల్వే శాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెడుతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 10.45కు వర్చువల్ పద్దతిలో కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్‌కు పచ్చజెండా ఊపనున్నారు. వారంలో ఆరు రోజుల పాటు నడిచే ఈ వందేభారత్.. బుధవారం మాత్రం అందుబాటులో ఉండదు. తెలంగాణ, ఏపీ, కర్నాటక మీదుగా ఈ వందేభారత్ నడవనున్నది. ఐటీ ఉద్యోగుల కోసమే ఈ వందేభారత్ ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య 610 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఏసీ చైర్‌కార్ రూ.1,600, ఎగ్జిక్యూటీవ్ టికెట్ రూ.2,915గా నిర్ణయించారు. క్యాటరింగ్ వద్దని అనుకుంటే ఏసీ చైర్ కార్ రూ.1,255గా.. ఎగ్జిక్యూటీవ్ టికెట్ రూ.2,515గా నిర్ణయించారు. కాగా, ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు 16 కోచ్‌లతో నడుస్తున్నాయి. అయితే కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ మాత్రం 8 కోచ్‌లతోనే పట్టాలు ఎక్కనున్నది. ఇందులో 7 ఏసీ చైర్‌కార్‌లు ఒక ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ ఉంటుంది.

హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ వస్తుందని సంతోషపడిన ఐటీ, ఇతర ఉద్యోగులు దాని టైమింగ్ చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవి ఏ మాత్రం సౌకర్యంగా లేవని.. ఒక రోజు ఆఫీస్‌కు సెలవు పెడితే కానీ ఆ ప్రయాణం వీలుండదని అంటున్నారు. ఈ వందే భారత్ రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. మహబూబ్‌నగర్ (6.49 గంటలు).. కర్నూల్ సిటీ (8.24 గంటలు).. అనంతపూర్ (ఉదయం 10.44 గంటలు).. ధర్మవరం (ఉదయం 11.14 గంటలు) మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 2.00 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆఫీసుకో, ఇంటికో చేరుకురే సరికి సాయంత్రం అవుతుంది. అంటే పగటిపూట అంతా ప్రయాణానికే కేటాయించాల్సి ఉంది.

ఇక రిటర్న్ జర్నీ టైమింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మధ్యాహ్నం 2.45కు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరే వందేభారత్.. కాచిగూడకు రాత్రి 11.15కు చేరుకుంటుంది. బెంగళూరు ట్రాఫిక్‌ను దాటుకొని రావాలంటే మధ్యాహ్నం 12 గంటలకే బయలుదేరక తప్పదు. ఇక హైదరాబాద్‌కు 11.15కు చేరుకుంటే.. కూకట్‌పల్లి, మియాపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్లేసరికి రాత్రి 1.00 అవుతుంది. ఏ రకంగా చూసినా రైలు టైమింగ్స్ ఐటీ ఉద్యోగులకు ఏ మాత్రం సౌకర్యంగా లేవని అంటున్నారు. యశ్వంత్‌పూర్‌కు కనీసం 12 గంటల లోపు చేరుకునేలా టైమింగ్స్ మారిస్తే.. హాఫ్‌డే వర్క్ చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. యశ్వంత్‌పూర్‌లో కూడా సాయంత్రం 4 గంటలకు బయలుదేరితే ఉద్యోగులకు సౌకర్యంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి భవిష్యత్‌లో టైమింగ్స్ మారుస్తారా? లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.

అయితే ఐటీ ఉద్యోగులకు జనరల్ నాలెడ్జ్ తక్కువ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకల్లా బెంగళూరు చేరాలంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎన్నిగంటలకు బయలుదేరాలి..? వాళ్లు చెప్పినట్టుగా అర్థరాత్రి ఏ ఒంటిగంటకో, రెండు గంటలకో ఇళ్లనుంచి బయలుదేరితే తప్ప ఆ ట్రైన్ ను అందుకోలేరు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు ఆ ట్రైన్ దిగాక ఇంటికి చేరుకోవాలంటే తెల్లవారు ఝామున మూడో నాలుగో అవుతుంది. అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News