బీజేపీలో పేరాల ట్వీట్ బాంబ్.. అధిష్టానానికి చురకలు
రిషి సునాక్ ఫొటో పెట్టి సొంత పార్టీ నేతల్ని చెడుగుడు ఆడుకున్నారు శేఖర్జీ. కులం, డబ్బుకే కాదు, వ్యక్తిత్వానికి కూడా విలువ ఉంటుందని, తెలంగాణ బీజేపీ నేతలు, ఇతర పెద్ద నాయకులు దీన్ని అర్థం చేసుకోవాలంటూ చురకలంటించారు.
పేరాల చంద్రశేఖర్ రావు. ఆమధ్య తెలంగాణ బీజేపీలో కాస్త బలంగా వినిపించిన పేరు. అధిష్టానానికి దగ్గరి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎక్కడ..? ఆయన్ను పట్టించుకునేవారేరి..? మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఆయన వాయిస్ వినిపించడం లేదెందుకు..? పోనీ ప్రచారానికి కాస్త దూరంగా ఉన్నారని అనుకున్నా, తాజాగా ఆయన పెట్టిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.
రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన వేళ భారత్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీజేపీ నుంచి కూడా చాలామంది ఆయనకు మద్దతుగా ట్వీట్లు పెట్టారు. కానీ బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు పేరాల చంద్రశేఖర్ రావు వేసిన ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది. రిషి సునాక్ ఫొటో పెట్టి ఆయన సొంత పార్టీ నేతల్ని చెడుగుడు ఆడుకున్నారు. కులం, డబ్బుకే కాదు, వ్యక్తిత్వానికి కూడా విలువ ఉంటుందని, తెలంగాణ బీజేపీ నేతలు, ఇతర పెద్ద నాయకులు దీన్ని అర్థం చేసుకోవాలంటూ చురకలంటించారు.
పేరాల టార్గెట్ ఎవరు..?
పేరాల చంద్రశేఖర్ రావు అలియాస్ శేఖర్జీ. ప్రగతి భవన్లో కేటీఆర్ తో జరిగిన ఓ మీటింగ్ తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులకు టార్గెట్ అయ్యారు. లింగోజీగూడ కార్పొరేటర్‌గా ఎన్నికైన వ్యక్తి ప్రమాణస్వీకారం కంటే ముందే చనిపోవడంతో, ఆయన స్థానంలో బీజేపీ తరపున ఆయన కొడుకుకి టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నిక లేకుండా ఏకగ్రీవం చేసుకోడానికి శేఖర్జీ ఆధ్వర్యంలో కొందరు నేతలు ప్రగతి భవన్ కి వచ్చి కేటీఆర్ ని కలిశారు. అక్కడ జరిగిన చర్చల్లో కేటీఆర్, బండి సంజయ్ పై ఫిర్యాదు చేయడం, ఆయన నోటి దురుసు గురించి తమకూ తెలుసని శేఖర్జీ చెప్పడం, అధిష్టానం కూడా ఆ విషయంలో సీరియస్ గా ఉందని అనడంతో అసలు కథ మొదలైంది. ఈ విషయం బయటకు రావడంతో బండి సంజయ్, శేఖర్జీని టార్గెట్ చేశారు. దీనిపై ఓ ఎంక్వయిరీ కూడా జరిగింది. అయితే ఈ విషయంలో తనని బలిపశువుని చేశారనేది శేఖర్జీ వాదన. ఈ వ్యవహారంపై ఆయన గతేడాది సంఘ్ పరివార్ కి, బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. అప్పట్లో ఈ లేఖ తీవ్ర చర్చనీయాంశమైంది.
పేరాల ఎన్ని లేఖలు రాసుకున్నా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ బీజేపీలో ఆయనకు అవకాశాలు లేకుండా చేశారు. బండి సంజయ్ టీమ్ ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టింది. అటు అధిష్టానం కూడా శేఖర్జీని పక్కనపెట్టింది. దీంతో శేఖర్జీ పార్టీలో ఉన్నారన్నమాటే కానీ, అవమాన భారంతో రగిలిపోతున్నారు. పక్క పార్టీల్లోకి వెళ్లలేక, సొంత పార్టీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారు. అప్పట్లో లేఖతో బయటపెట్టిన ఆవేదన, ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న ఆందోళన.. ఇప్పుడు ట్వీట్ రూపంలో మరోసారి బయటపెట్టారు. కేవలం కులం, డబ్బుకే కాదు, వ్యక్తిత్వానికీ విలువ ఉంటుందంటూ పార్టీ అధినాయకత్వానికి చురకలంటించారు శేఖర్జీ.