పేపర్ లీకేజీ కేసు: ఈటల రాజేందర్ కు నోటీసులిచ్చిన పోలీసులు
బండి సంజయ్ కి ప్రశ్నాపత్రం పంపించిన ఏ2 నిందితుడు ప్రశాంత్, అంతకన్నా ముందే ఈటల రాజేందర్ కు, ఆయన పీఏలు రాజు, నరేందర్ లకు కూడా ఆ ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ చేశాడు. పోలీసులు ఈ ముగ్గురి పేర్లను కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
తెలంగాణలో పదవతరగతి ప్రశ్నా పత్రం లీకేజీ కేసు సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ నాయకులే లీకేజీ సూత్రధారులు, పాత్రధారులంటూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా పలువురిని ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరో వైపు ఇదే కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, అతని ఇద్దరు పీఏ లకుకూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. బండి సంజయ్ కి ప్రశ్నాపత్రం పంపించిన ఏ2 నిందితుడు ప్రశాంత్, అంతకన్నా ముందే ఈటల రాజేందర్ కు, ఆయన పీఏలు రాజు, నరేందర్ లకు కూడా ఆ ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ చేశాడు. పోలీసులు ఈ ముగ్గురి పేర్లను కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
ఈటల తో పాటు ఆయన ఇద్దరు పీఏ ల వాగ్మూలాలను కూడా నమోదు చేస్తామని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో మరో ఆసక్తికర విషయంపై బీఆరెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. పదవతరగతి హిందీ పేపర్ లీక్ అయిన పాఠశాల కమలాపూర్ మండల్ , ఉప్పల్ లో ఉంది. ఆ ఊరు ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది.