పాలమూరు ఎండబెట్టారు.. కాళేశ్వరం పండబెట్టారు
కరువుకు కేరాఫ్ గా పాలమూరును కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరును ఎండబెట్టారని.. కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను మంత్రులు సందర్శించడంపై ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. పాడిపంటల పాలమూరును పడావు పెట్టి 14 లక్షల మంది ప్రజల వలసలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి ఆంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలేనని తెలిపారు. కల్వకుర్తి కింద నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు కూడా నిర్మించలేదని, అదే ఆంధ్రలో 400 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించారని అన్నారు. కేసీఆర్ ముందుచూపుతో పాలుమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించారని, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు వందల కేసులు వేసి పాలమూరును అడ్డుకున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో 57 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. కృష్ణా నది నుంచి రోజు లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నా రిజర్వాయర్లు నింపుకోలేకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతోనే వట్టెం పంపుహౌస్ మునిగిపోయిందన్నారు. పది నెలల నుంచి సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రి పాలమూరు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా కొడంగల్, నారాయణపేట్ కు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి భేషజాలకు పోయి కొత్త లిఫ్ట్ స్కీం మొదలు పెట్టారని అన్నారు. పాలమూరు పంపుహౌస్ లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి అందుబాటులో ఉన్న మోటార్లతో రిజర్వాయర్లు నింపే ప్రయత్నం చేయాలన్నారు.