పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించిన 45 టీఎంసీలు మావే.. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ కౌంటర్

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement
Update:2023-02-02 09:07 IST

తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నది నీటి పంపకాల విషయంలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ అక్రమంగా కృష్ణ నదిలోని తెలంగాణ వాటా నీళ్లను వాడుకుంటున్నదనే వాదనలు ఉన్నాయి. తాజాగా పోలవరం డైవర్షన్ ద్వారా నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవల్సిన 45 టీఎంసీల జలాలు తెలంగాణకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు బుధవారం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

దక్షిణ తెలంగాణకు సాగు, తాగు నీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు సదరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 246 జారీ చేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జీవో నెంబర్ 246పై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 1974 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తే.. నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిని నిలిపేయాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపింది. అంతే కాకుండా కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలైన( 1974లో) ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీల చొప్పున నీటి వాటాను కేటాయించినట్లు కౌంటర్‌లో వెల్లడించింది.

1974లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కేటాయించిన నీటిని నాగార్జునసాగర్ ఎగువన మాత్రమే.. అది కూడా బేసిన్‌ లోపల ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే వినియోగించుకోవల్సి ఉంటుందని వివరించింది. దాని ప్రకారం ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలు నీళ్లు తెలంగాణకు మాత్రమే చెందుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నట్లు తెలియజేసింది.

కర్ణాటక ప్రభుత్వం గోదావరి నీటి మళ్లింపు ద్వారా లభించిన కృష్ణా నది నీటి వాటాను పలు ఉపనదులకు కూడా వాడుకుంటున్నదని తెలిపింది. కృష్ణా నదిలో 21 టీఎంసీలు లభిస్తే.. దానిలో 2.4 టీఎంసీలను అప్పర్ భద్ర నదికి కేటాయించుకున్నదని చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడమే కాకుండా, సదరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇచ్చినట్లు కౌంటర్‌లో తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జీవో 246 ద్వారా కేటాయించిన 90 టీఎంసీలో నీటిలో 45 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ద్వారా కేటాయించుకున్నామని, మిగిలిన 45 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్‌లో మిగులుతున్న జలాల నుంచి కేటాయించినట్లు స్పష్టం చేసింది. కాగా, తెలంగాణ ఇచ్చిన కౌంటర్‌కు రెండు వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని ఏపీకి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గడువు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News