తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరిగిన వరి సాగు విస్తీర్ణం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లోని ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం 13.89 లక్షల హెక్టార్లు ఉండగా.. తొమ్మిదేళ్ల తర్వాత ఏకంగా సాగు విస్తీర్ణం రెట్టింపు కావడం గమనార్హం.
తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత కొన్ని వారాల పాటు వర్షాభావ పరిస్థితులు, పొడి వాతావరణం నెలకొన్నాయి. అయినా సరే రైతులు ఈ సారి రికార్డు స్థాయిలో వరి పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 26.30లక్షల హెక్టార్లలో వరిని పండిస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 20.17 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది. కానీ ఈ సారి అంతకు మించి దాదాపు 6.13 లక్షల హెక్టార్ల వరి సాగు విస్తీర్ణం పెరిగింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లోని ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం 13.89 లక్షల హెక్టార్లు ఉండగా.. తొమ్మిదేళ్ల తర్వాత ఏకంగా సాగు విస్తీర్ణం రెట్టింపు కావడం గమనార్హం. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం వరి ధాన్యం సాగు 1.89 శాతం నుంచి 411.95 శాతానికి పెరిగింది. గతేడాది ఇదే సీజన్‌లో 404.27 గా ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పంటల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నది.
కొన్ని రోజులుగా వర్షాలు సరిగా కురవక పోవడంతో పాటు చిన్నపాటి చెరువులు, కుంటల్లో పంటలకు సరిపడినంత నీటి లభ్యత లేదు. ప్రస్తుతం పంటల పెరుగుదల కీలకమైన దశలో ఉన్నది. ఇలాంటి సమయంలో మరో వారంలో కనుక వర్షాలు పడకపోతే.. పంటలకు దారుణమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రైతు సంఘం నాయకుడు మల్లారెడ్డి తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో మిల్లెట్లు, పత్తి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాధారణంగా రాష్ట్రంలో 3.11 లక్షల హెక్టార్లలో కందుల సాగవుతుంది. కానీ ఈ ఏడాది దీని విస్తీర్ణం 1.91 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. మొక్క జొన్న పంట సాగుకూడా 2.88 లక్షల హెక్టార్ల నుంచి 2.13 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. పత్తి సాగు విస్తీర్ణం 20.23 లక్షల హెక్టార్ల నుంచి 18.11 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. మూడో ముందస్తు అంచనాల ప్రకారం 2022-23లో ఆహార్య ధాన్యాల ఉత్పత్తి 175.27 లక్షల టన్నులుగా ఉండనున్నది.