అతి విశ్వాసమే ఈటల కొంప ముంచిందా?
కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని ఈటల తన సొంత నియోజకవర్గంతో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేశారు. హుజూరాబాద్ లో తనకు ఎలాగూ తిరుగు ఉండదని భావించిన ఈటల ఎక్కువ గజ్వేల్ పైనే ఫోకస్ పెట్టారు.
బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. గజ్వేల్ లో ఫలితం ఎలా ఉన్నా.. సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో మాత్రం ఈటల గెలుపు ఖాయమని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈటల పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయితే ఆయన ఓటమికి కారణం అతి విశ్వాసమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈటల రాజేందర్ 2004 నుంచి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. మూడుసార్లు ఉప ఎన్నికల్లో, నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు.
2021లో ఈటల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా హుజూరాబాద్ లో మోహరించినప్పటికీ ఈటల మాత్రం 23,865 ఓట్ల మెజారిటీతో గెలిచి తన బలం ఏంటో చూపించారు. ఉప ఎన్నికల్లో గెలిచి రెండేళ్లు కూడా గడవకముందే హుజూరాబాద్ లో ఈటల పరిస్థితి రివర్స్ అయి ఓటమి చెందారు. రెండు చోట్ల పోటీ చేయడమే ఈటలకు శాపంగా మారిందని అంతా భావిస్తున్నారు.
కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని ఈటల తన సొంత నియోజకవర్గంతో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేశారు. హుజూరాబాద్ లో తనకు ఎలాగూ తిరుగు ఉండదని భావించిన ఈటల ఎక్కువ గజ్వేల్ పైనే ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రచారం నిర్వహించేందుకే ఎక్కువ రోజులు కేటాయించారు.
హుజూరాబాద్ లో ఈటల సతీమణి జమున ప్రచారం నిర్వహించడంతో ఈటల హుజూరాబాద్ లో గెలిచినా గజ్వేల్ కి వెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో ఈటలకు బదులుగా ఓటర్లు ప్రత్యామ్నాయంగా ప్రణవ్ ను ఎంచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇద్దరికీ చీలడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి సులభంగా గెలుపొందారు. హుజూరాబాద్ లో ఎలాగైనా గెలుస్తా..అన్న అతి విశ్వాసమే ఈటల కొంప ముంచిందని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
∗