మూసీ నదికి వరదలు... నిరాశ్రయులైన 2వేల మంది

భారీ వర్షాల వల్ల మూసీ నదికి వచ్చిన వరదలు దాదాపు 2 వేల మందిని నిర్వాసితులను చేశాయి. వీళ్ళను ప్రభుత్వం సహాయ కేంద్రాలకు తరలిస్తున్నప్పటికీ చాలా మంది వెళ్ళడానికి సిద్దంగా లేకపోవడం గమనించాల్సిన అంశం.

Advertisement
Update:2022-07-28 12:41 IST

తెలంగాణలో కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల వల్ల‌ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగుల కాగా, ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌ లోకి ఇన్ ఫ్లో 8,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10,700 క్యూసెక్కులుగా ఉంది. 8 గేట్లు ఎత్తి మూసీకి నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.10 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 8,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 8,281 క్యూసెక్కులు. ఉస్మాన్ సాగర్ 13 గేట్లు ఎత్తి మూసీకి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి.

హైదరాబాద్ లో చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌ ప్రాంతాల్లో మూసీ నదికి లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది కుటుంబాలు నిర్వాసితులైనారు. దాదాపు 2 వేల మంది నిర్వాసితులైనట్టు సమాచారం.ప్రభుత్వం, ప్రభుత్వ భవనాలు, ఇతర సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ చాలా మంది వెళ్ళడానికి సిద్దంగా లేరు. 

అలా సహాయ కేంద్రాలకు వెళ్ళకుండా ఉన్న కుటుంబాల్లో 80 ఏళ్ల దౌలత్ బీ కుటుంబమొకటి. తమ‌ ఇంటిని ఎవరైనా దోచుకుంటారేమోననే భయంతో అవసరమైన అన్ని వస్తువులతో ఆ కుటుంబం అదే పరిసరాల్లో చాదర్‌ఘాట్ వంతెన కింద ఆశ్రయం పొందారు. "విద్యుత్ తో సహా ఎలాంటి ప్రాథమిక సౌకర్యాలు లేకుండా, మేము 24 గంటలకు పైగా బహిరంగ ప్రదేశంలో ఇక్కడే ఉంటున్నాము.నిన్న రాత్రి మేము నిద్రపోలేకపోయాము. దోమలు, వరద నీటి ముప్పు పెరిగిపోవడంతో నిద్రెలా పడుతుంది? మేము ఇప్పటికే చాలా అలసిపోయాము. నీరు బయటకు పోయిన వెంటనే మా ఇళ్లకు తిరిగి వెళ్లాలనుకుంటున్నాము. ఇల్లంతా బురదతో నిండి పోయి ఉంది. ఇంటి గోడలు బలహీనంగా ఉన్నాయి, వాటన్నింటినీ సరిదిద్దాలి. వరదలు తగ్గినా మాకు చాలా పని ఉంటుంది"అని దౌలత్ బీ చెప్పింది.

దాదాపు 379 కుటుంబాలు ఉన్న మూసా నగర్‌లో కనీసం 50 ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. అయినప్పటికీ, చాలా కుటుంబాలు వరద నీటికి ప్రభావితం కాని తమ పొరుగువారి ఇళ్లలో ఆశ్రయం పొందేందుకు ఇష్టపడుతున్నాయి.

హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ రిజర్వాయర్‌ గేట్లను ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌కు తెరవ‌డంతో మూసానగర్‌, శంకర్‌నగర్‌, కమలానగర్‌, మూసీ నది వెంబడి ఉన్న పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ నది వెంబడి ఉన్న ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వ 2 బెడ్ రూం హౌసింగ్ పథకాన్ని తమకు కూడా వర్తింపజేయాలని ఆశిస్తున్నారు.

"మా కాలనీలు ముంపునకు గురికావడం ఇది మొదటి సారి కాదు.రెండేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాం, ఇదే తరహాలో ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ప్రభుత్వం దగ్గర్లో ఎక్కడో ఒక పక్కా ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి. మేమంతా రూ.5,000-రూ.6,000 అద్దె చెల్లించలేని పేదలం. ప్రభుత్వ సహాయం లేకుండా మేము ఎక్కడికి వెళ్తాము? అని మరో నివాసి మహ్మద్ రఫీక్ అన్నారు.

మూసీ నదిలో భారీగా నీరు ప్రవహించడంతో అధికారులు మంగళవారం సాయంత్రం మూసారాంబాగ్ వంతెనను మూసివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మలక్‌పేటలోని ధోబీ గల్లీకి చెందిన 1500 మందిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం షెల్టర్ హోమ్‌లకు తరలించారు.

ఇదిలా ఉండగా, హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు అధికారులు పేర్కొన్నట్లు పూర్తి-ట్యాంక్-లెవల్ (ఎఫ్‌టిఎల్)కి చేరుకోలేదని జలవనరుల మండలి అధ్యక్షురాలు, కార్యకర్త లుబ్నా సర్వత్ ఆరోపించారు. ఆమె చెప్తున్న దాని ప్రకారం, ప్రస్తుత వరదలు నదీ పరీవాహక ప్రాంతాల్లో జరిగిన‌ ఆక్రమణల వల్ల వచ్చాయి.

Tags:    
Advertisement

Similar News