మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు
అది తప్పుడు ప్రచారం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
తమ ఇల్లు బఫర్ జోన్ లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. తాము కృష్ణకాంత్ పార్క్ కు దిగువన మధురానగర్ లోని ఇంట్లో నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో, కొన్ని పేపర్లలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ఒకప్పటి పెద్ద చెరువునే రెండు దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్క్ గా మార్చారని, చెరువు కట్ట దిగువన పది మీటర్లు దాటితే అక్కడ నిర్మాణాలు ఇరిగేషన్ శాఖ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ లోకి రావని తెలిపారు. తమ ఇల్లు కృష్ణకాంత్ పార్క్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉందన్నారు. 1980లో తన తండ్రి ఆ ఇంటిని నిర్మించారని తెలిపారు. అప్పటి నుంచి ఆ ఇంటిలోనే తాము నివాసం ఉంటున్నామని తెలిపారు. సంప్రదాయాల ప్రకారం చెరువు కట్టను ఆనుకొని కట్టమైసమ్మ ఆలయాలు నిర్మిస్తారని, తమ ఇల్లు కట్టమైసమ్మ గుడి నుంచి కి.మీ. దూరంలో ఉందని తెలిపారు. వాస్తవాలను గ్రహించాలని, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.