శ్రీరామనవమి రోజు భద్రాద్రి రామయ్య కల్యాణం.. దగ్గరుండి చూడాలనుకుంటున్నారా..!
కల్యాణం రోజు వెళ్లడం వీలుకాని భక్తులు 5 వేలు, 116 రూపాయల టికెట్లతో పరోక్ష పద్ధతిలో గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఈ టికెట్లు కూడా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
శ్రీరామనవమి రోజున భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని దగ్గరుండి చూడాలని చాలామంది భక్తులు కోరుకుంటారు. అలాంటి వారికోసం భద్రాద్రి దేవస్థానం ఏటా ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని పురస్కరించుకుని కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించాలనుకునే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచింది దేవస్థానం.
శ్రీరామ నవమి రోజున ఉభయ దాతల టికెట్ రుసుమును 7వేల 500గా నిర్ణయించారు. ఈ టికెట్ ద్వారా ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అలాగే 2వేల 500, 2వేలు, వెయ్యి, 300, 150 రూపాయల టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లపై ఒక్కరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. 18న పట్టాభిషేకం కోసం 1500, 500, 100 రూపాయల టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. వీటిని https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
కల్యాణం రోజు వెళ్లడం వీలుకాని భక్తులు 5 వేలు, 116 రూపాయల టికెట్లతో పరోక్ష పద్ధతిలో గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఈ టికెట్లు కూడా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి 17 వరకు ఉదయం ఆరు గంటల నుంచి భద్రాద్రిలోని రామాలయ కార్యాలయంలో ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా టికెట్లు కొనుక్కోవాలంటే ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం, తానీషా కల్యాణ మండపం, గోదావరి బ్రిడ్జ్ సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది.