ఈ నెల 20న వెయ్యి పాఠశాలలు ప్రారంభం : మంత్రి సబిత ఇంద్రారెడ్డి

యూనిఫామ్స్ కోసం రూ.150 కోట్లు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement
Update:2023-06-13 07:13 IST

మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తయిన 1000 పాఠశాలలను ఈ నెల 20 ప్రారంభిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర సౌకర్యాలను మెరుగు పరిచారు. మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి పేరుతో ఆయా పాఠశాలలను పునరుద్దరించారు. వీటిలో 1000 పాఠశాలలను ప్రారంభించనున్నట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్స్, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్ బుక్‌లు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్క్స్ కూడా ఈ నెల 20న అందించనున్నారు. యూనిఫామ్స్ కోసం రూ.150 కోట్లు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి సోమవారం నుంచి పాఠశాలలు పునప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలోని రావిర్యాల బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడి బాటలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికారు. కొత్తగా బడిలో చేరిన వారికి పలకలు పంపిణీ చేసి, అక్షరాభ్యాసం చేయించారు. ప్రతీ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని ఉపాధ్యాయులకు సూచించారు.

కాగా, వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునప్రారంభం అయ్యాయి. తొలి రోజు 30 నుంచి 40 శాతం మేర విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో హాజరయ్యారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు హాజరును విద్యా శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. సంక్షేమ గురుకులాల్లో 20 నుంచి 30 వాతం, కళాశాలల్లో 40 శాతం హాజరు ఉన్నట్లు గురుకుల సొసైటీలు తెలిపాయి. ఈ నెల 16 కల్లా 80 శాతానికి పైగా హాజరు ఉండేలా చూడాలని గురుకులాల టీచర్లకు అధికారులు ఆదేశించారు. 

Tags:    
Advertisement

Similar News