అంకుల్ వాటర్ ప్లీజ్...బాలల దినోత్సవం నాడు, చిన్న పిల్లవాడి కోరికకు స్పందించిన కేటీఆర్

ఓ బాలుడు తమ ఏరియాలో ఉన్న నీటి సమస్యపై ఓ వీడియోలో అభ్యర్థించగా కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆ సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Update:2022-11-14 13:00 IST

బాలల దినోత్సవం సందర్భంగా, సోమవారం హైదరాబాద్‌కు చెందిన ఒక చిన్న పిల్లవాడు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కెటిఆర్ కు వీడియో ద్వారా ఒక అభ్యర్థన చేసాడు. అది సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. దాంతో కేటీఆర్ దృష్టిలో పడిన ఆ వీడియోను చూసిన ఆయన వెంటనే స్పందించారు.

ఆ వీడియోలో బాలుడు.. "కెటిఆర్ అంకుల్ కు చిన్న పిల్లల దినోత్సవ శుభాకాంక్షలు" అనే ప్లకార్డ్‌ను పట్టుకుని కనిపించాడు. ప్లకార్డ్‌పై , "మేము గోల్డెన్ సిటీ కాలనీలో పిల్లర్ నంబర్ 248 సమీపంలో నివసిస్తున్నాము. మేము గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ నీటి కోసం ఎదురు చూస్తున్నాము. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి." అని రాసి ఉంది.

ఆ వీడియోను పటేల్ అనే అతను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కు కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ... '' కేటీఆర్ సార్, ఈ బాలల దినోత్సవం రోజున ఒక అందమైన అబ్బాయి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాడు. మేము గత 5 సంవత్సరాల నుండి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నాము (గోల్డెన్ సిటీ కాలనీ, పిల్లర్ నెం:248) ఐదేళ్ళుగా తాగునీటి పైప్‌లైన్ కోసం ఎదురు చూస్తున్నాము... మేము ప్రతి పన్నును సక్రమంగా చెల్లిస్తున్నాము.'' అని రాశాడు.

వెంటనే రియాక్ట్ అయిన కేటీఆర్... హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ ను స్థలాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై తన కార్యాలయాన్ని ఫాలో అప్ చేయాలని కోరారు. "ఈరోజే స్వయంగా సందర్శించి సమస్యను పరిష్కరించాల్సిందిగా దాన కిషోర్ గారిని అభ్యర్థిస్తున్నాను.'' అని కేటీఆర్ ఆ బాలుడి వీడియోను రీట్వీట్ చేస్తూ కోరారు.

మంత్రి ట్వీట్‌పై దాన కిషోర్ స్పందిస్తూ, "తప్పకుండా తనిఖీ చేస్తాము సార్.. ఈ పని ORR ఫేజ్ -2 కింద మంజూరు చేయబడింది, వర్షాకాలం కారణంగా ప్రారంభం కాలేదు. వర్క్ పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన తేదీని పోస్ట్ చేస్తాను " అని దాన కిశోర్ రిప్లై ఇచ్చారు.

దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సమస్య‌పై స్పందించడమే కాక వెంటనే పరిష్కారానికి నడుం భిగించిన కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. 


Tags:    
Advertisement

Similar News