తెలంగాణకు ఓమ్నికామ్ మీడియా హౌస్..
తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్న ఓమ్నికామ్, హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ని స్థాపించబోతోంది. ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా 2500మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
తెలంగాణకు మరోసారి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల వరద పారిస్తున్నారు మంత్రి కేటీఆర్. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గ్లోబల్ మీడియా పవర్ హౌస్ అయిన ఓమ్నికామ్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు. చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణలో ఓమ్నికామ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.
గ్లోబల్ మీడియా పవర్ హౌస్ గా ఓమ్నికామ్ గ్రూప్ కి పేరుంది. మీడియా, మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ రంగంలో ఓమ్నికామ్ లీడింగ్ కంపెనీగా ఉంది. న్యూయార్క్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్న ఓమ్నికామ్, హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ని స్థాపించబోతోంది. ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా 2500మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈమేరకు మంత్రి కేటీఆర్ తో జరిగిన చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
హైదరాబాద్ లో మీడియా పరిశ్రమ ఉనికి మరింతగా పెరుగుతోందనడానికి ఈ పెట్టుబడులే నిదర్శనం అని అంటున్నారు మంత్రి కేటీఆర్. ఓమ్నికామ్ ప్రతినిధులతో జరిగిన సమావేశం విజయవంతమైందని చెప్పారు. పెట్టుబడులతోపాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారతీయ మార్కెట్ సత్తాని గుర్తించాయన్నారు కేటీఆర్.
♦