కేటీఆర్ ట్వీట్ తో ఆగ‌మేఘాల మీద చిన్నారిని కలిసిన అధికారులు... కేటీఆర్ ప్రశంస‌

ఓ పిల్లవాడు కేటీఆర్ కు పొద్దున తమ సమస్యను చెప్పుకున్నాడు. మధ్యాహ్నానికల్లా సమస్య పరిష్కారమై పోయింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఓ కాలనీకి మంచినీళ్ళు రావడం లేదంటూ ఓ బుడతడు మాట్లాడిన వీడియో ట్విట్టర్ లో చూసిన కేటీఆర్ గంటల వ్యవధిలో సమస్య‌ను పరిష్కరించారు.

Advertisement
Update:2022-11-14 16:57 IST

తెలంగాణ ప్రభుత్వంలో పిట్టతో కబురంపినా పనులు ఎలాజరుగుతున్నాయో తెలియడానికి ఈ ట్విట్టర్ పిట్ట సందేశమే ఓ ఉదహరణ. ''అంకుల్ వాటర్ ప్లీజ్...బాలల దినోత్సవం నాడు, చిన్న పిల్లవాడి కోరికకు స్పందించిన కేటీఆర్'' అనే వార్తను కొన్ని గంటల ముందు తెలుగు గ్లోబల్ లో పోస్ట్ చేశాం. అందులో ఐదేళ్ళ నుంచి తమకు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నామంటూ ఉమర్ అనే ఓ చిన్నారి ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో పై కేటీఆర్ స్పందించి... హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ ను స్థలాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలని కోరారు.అందుకు జవాబుగా తప్పకుండా తనిఖీ చేస్తాము సార్ అని చెప్పిన దాన‌ కిశోర్, ఇతర అధికారులతో కలిసి కొన్ని గంటల్లోనే ఆ పిల్లాడి ముందు వాలిపోయారు.

ఆ పిల్లవాడు నివసించే రాజేంద్రనగర్ లోని గోల్డెన్ సిటీ కాలనీలో పర్యటించారు దానకిశోర్. ఉమర్ ఇంటి కూడా వెళ్ళారు. మంచినీటి సరఫరా పరిస్థితిని అక్కడికక్కడే అధికారులతో సమీక్షించారు. అనంతరం కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అందులో...

''సర్, తనిఖీ చేసి, చిన్నారి ఉమర్‌ను కలిశాను. ఈ ప్రాంతానికి వాటర్ పైప్ లైన్ కోసం రూ. 2.85 కోట్లు మంజూరయ్యాయి. వ‌ర్షాకాలం కార‌ణంగా మొన్న‌టి వ‌ర‌కు ప‌నులు చేప‌ట్ట‌లేదు. త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభిస్తాం. వాటర్ పైప్ లైన్ నుంచి ఉమర్ ఉన్న‌ ఏరియాకు నీటి విడుదల చేస్తాం'' అని హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్బి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ ట్వీట్ చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ వెల్ డన్ ఎండీ గారు అని అభినందించారు.


Tags:    
Advertisement

Similar News