ఎన్టీపీసీ తెలంగాణ యూనిట్ రెడీ.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

800 మెగావాట్ల యూనిట్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పవర్ గ్రిడ్‌కు అనుసంధానం అయ్యింది. ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 85 శాతం తెలంగాణ రాష్ట్రానికే సరఫరా చేస్తారు.

Advertisement
Update:2023-09-29 07:28 IST

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తెలంగాణ అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన విద్యుత్ ప్లాంట్ తొలి దశ పూర్తిగా సిద్ధమయ్యింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 1600 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్ నిర్మించాల్సి ఉండగా.. తొలి దశలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన యూనిట్ అందుబాటులోకి వచ్చింది. తొలి దశలో నిర్మించిన మొదటి యూనిట్ సింక్రనైజేషన్ మార్చి 24న నిర్వహించగా.. సెప్టెంబర్ 5న ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నది. బుధవారం అర్థరాత్రి 12 గంటల నుంచి 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి స్థాయి కమర్షియల్ ఉత్పత్తిలోకి తీసుకెళ్లినట్లు అధికారులు చెప్పారు.

800 మెగావాట్ల యూనిట్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పవర్ గ్రిడ్‌కు అనుసంధానం అయ్యింది. ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 85 శాతం తెలంగాణ రాష్ట్రానికే సరఫరా చేస్తారు. కాగా, కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో అక్టోబర్ 3న ప్రధాని నిజామాబాద్ పర్యటనలో అక్కడి నుంచే ఈ యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన మొదటి యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రావడంతో రాష్ట్రానికి విద్యుత్ కొరత కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది.

ఇక రెండో  యూనిట్ సింక్రనైజేషన్ ఆగస్టు 24న చేశారు. దీని ట్రయల్ రన్ కూడా నిర్వహించాల్సి ఉన్నది. అది కూడా పూర్తయి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభించడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్టీపీసీ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టుకు రూ.10,598 కోట్ల వ్యయం కానున్నది. దీనికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయించారు. సింగరేణి, ఒడిశా మందాకిని కోల్‌బ్లాక్ నుంచి 8 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా అవుతోంది.

Tags:    
Advertisement

Similar News