సోషల్‌ మీడియాను నమ్ముకుంటే జైలుకు పోతరు

ప్రధాన ప్రతిపక్షానికి సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరిక

Advertisement
Update:2024-10-05 16:17 IST

సోషల్‌ మీడియాను నమ్ముకొని కొందరు అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని.. అధికారంలోకి రావడం కాదు వాళ్లు చర్లపల్లి జైలుకు పోవడం ఖాయమని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో మూసీ బాధితులను ఆదుకుంటామన్నారు. వాళ్ల కోసం ఓ రూ.10 వేల కోట్లు ఖర్చు చేయలేమా అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు పేదలపై నిజంగా ప్రేమ ఉంటే వాళ్ల ఫామ్ హౌస్ ల భముల్లో కొంత భూమిని పేదలకు దానం చేయాలన్నారు. వాళ్లు ఫామ్ హౌసుల్లో జమీందారుల్లా బతుకుతారు పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా అని ప్రశ్నించారు. అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్స్‌, అంబర్ పేట్ పోలీస్ అకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టిస్తామన్నారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌ మూసీ రివర్‌ బెడ్‌, బఫర్‌ జోన్‌ లో ఉన్న పేదలను ఎలా ఆదుకోవాలో మంచి ఆలోచనలు ప్రభుత్వానికి సూచించాలన్నారు. వాళ్ల ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. వాళ్ల అనుభవంతో ఏం చేద్దామో చెప్పాలే తప్ప ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదన్నారు.

మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అనాథలను చేయదని.. వాళ్లకు ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత తమదేనన్నారు. రెచ్చగొట్టే వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందన్నారు. వాళ్ల ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు వేసుకొని వస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదని, అందరికి మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ ఎజెండా అన్నారు. నరేంద్రమోదీ సబర్మతి నదిని అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకున్నారని, సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేయలేకపోయిందని, నెల రోజుల్లోనే తమ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. రైతులెవ్వరూ దయచేసి రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు సమస్యలుంటే కలెక్టర్లను కలువాలని సూచించారు. కాకా స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

Tags:    
Advertisement

Similar News