అవిశ్వాస తీర్మానాలు ఇప్పట్లో లేనట్లే.. మున్సిపల్ కౌన్సిలర్లకు షాక్ ఇచ్చిన కలెక్టర్లు

తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌కు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. నిరుడు సెప్టెంబర్‌లో ఇరు సభలు ఆమోదించి గవర్న్ వద్దకు పంపినా.. ఇంత వరకు దానికి మోక్షం లభించలేదు.

Advertisement
Update:2023-02-14 13:10 IST

తెలంగాణలోని 13 కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికార బీఆర్ఎస్ కార్పొరేటర్లు/కౌన్సిలర్లు సొంత పార్టీ మేయర్లు/చైర్ పర్సన్లలపై అవిశ్వాస తీర్మానాలు పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా మేడ్చల్, దమ్మాయిగూడ, పెద్ద అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, తాండూర్, ఆలేర్, చండూర్, యాదగిరిగుట్ట, హుజూరాబాద్, నందికొండ, జనగాం మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్లలపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. త్వరలోనే మేయర్/చైర్ పర్సన్లు తమ బలాన్ని నిరూపించుకోవాలని కోరుతూ ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేస్తారని భావిస్తున్న సమయంలో కలెక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

అవిశ్వాస తీర్మానంలో సంతకాలు పెట్టిన అసమ్మతి వర్గ కార్పొరేటర్లు/కౌన్సిలర్ల సంతకాలు పోల్చి చూడాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి ఆయా సంతకాలను సరి పోల్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయా అవిశ్వాస తీర్మానాలు సరైన ఫార్మాట్‌లో ఉన్నాయా? నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చారా లేదా అనే విషయాన్ని కూడా తెలియజేయాలని కమిషనర్లను కలెక్టర్లు కోరారు.

కొత్త మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం.. అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చిన 30 రోజుల్లోగా కలెక్టర్లు స్పందించాల్సి ఉంటుంది. ఆలోగానే ఫ్లోర్ మీటింగ్ ఏర్పాటు చేసి బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి. అయితే, చాలా మున్సిపాలిటీలకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్లు తాము అవిశ్వాస తీర్మానంపై సంతకాలు పెట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కౌన్సిలర్లు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా సంతకాలను ఎఫ్ఎస్ఎల్‌కు పంపి వెరిఫై చేయించాలని మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌కు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. నిరుడు సెప్టెంబర్‌లో ఇరు సభలు ఆమోదించి గవర్న్ వద్దకు పంపినా.. ఇంత వరకు దానికి మోక్షం లభించలేదు. ఆ యాక్ట్ అమలులోకి వస్తే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నాలుగేళ్లలోపు వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండదు. ప్రస్తుతం దాని పరిమితి మూడేళ్ల వరకే ఉన్నది. చాలా మున్సిపాలిటీల్లో పాలక మండళ్ల పదవీ కాలం మూడేళ్లు ముగియడంతో అవిశ్వాస తీర్మానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు కలెక్టర్లు సంతకాలను వెరిఫై చేయాలని కోరడంతో మరోసారి అవిశ్వాస తీర్మానాలపై కాలయాపన తప్పడం లేదు. 

Tags:    
Advertisement

Similar News