పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు.. సాయం చేయలేనన్న రేవంత్ రెడ్డి

స్రవంతి దగ్గర భారీగా ఖర్చు పెట్టే స్థోమత లేకపోవడం, పార్టీ వైపు నుంచి కూడా నిధులు రాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు.

Advertisement
Update:2022-10-14 08:36 IST

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎంపికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అన్ని విషయాల్లో చేతులెత్తేసినట్లు తెలుస్తున్నది. ఓ వైపు మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవసరం అని చెప్తున్న రేవంత్ రెడ్డి.. అదే స్థాయిలో అక్కడ ఎఫర్ట్ పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. టికెట్ తెచ్చుకున్న పాల్వాయి స్రవంతికి కూడా అన్ని రకాలుగా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆమె దగ్గర భారీగా ఖర్చు పెట్టే స్థోమత లేకపోవడం, పార్టీ వైపు నుంచి కూడా నిధులు రాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. కేవలం రోజు వారీ ఖర్చులు మాత్రం సర్థు బాటు చేస్తున్నారు. మిగిలిన ప్రధాన పార్టీల ర్యాలీలకు జనాలను భారీగా సమీకరించి ప్రచారం చేస్తున్నారు. కానీ, స్రవంతి దగ్గర ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రచారంలో కూడా వెనుకబడినట్లు తెలుస్తున్నది.

మునుగోడు ఉపఎన్నికలో కచ్చితంగా భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిసే రేవంత్ రెడ్డి ముందుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. మిగిలిన వారి కంటే కృష్ణారెడ్డి అయితేనే భారీగా ఖర్చు పెడతాడని కూడా రేవంత్ వెల్లడించారు. కానీ రేవంత్ మాటలను మిగిలిన సీనియర్లు పట్టించుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, మధు యాష్కి, దామోదర రాజనర్సింహ వంటి నేతలు స్రవంతి వైపే ఉన్నారు. దీంతో ఆమెకే టికెట్ దక్కింది. కాగా, మొదట్లో వెంకటరెడ్డి ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తానని మాటిచ్చినా.. ఇప్పుడు చేతులెత్తేశారు. మరోవైపు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత్ జోడో యాత్ర పేరుతో మునుగోడు వైపు కన్నెత్తి చూడటం లేదు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతున్నా.. ఆర్థికపరమైన విషయాలు నాకు తెలియదని, తాను సాయం చేయలేనని చెప్పేశారు.

కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రస్తుతం నిధులు లేవని, పార్టీ నుంచి పైసా రాదని స్రవంతికి రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో నిధుల కోసం సీనియర్ల వైపు స్రవంతి చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు నిధులను సర్థుబాటు చేయడంతో ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. అదే సమయంలో స్రవంతి రోజు వారీ ఖర్చులకు సొంత నిధులు వాడుతున్నా.. చోటా మోటా లీడర్ల భారీ కోరికలు తీర్చడానికి మాత్రం నిధులు లేకుండా పోయాయి. ఇదే అదనుగా భావించి కాంగ్రెస్ లీడర్లను బీజేపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. పాల్వాయి కుటుంబానికి మొదటి నుంచి అనుచరులు, అభిమానులుగా ఉన్న వాళ్లు మాత్రం ఆమె వెంట ప్రచారానికి వెళ్తున్నారు.

రేవంత్‌పై వ్యతిరేకతతో పాల్వాయిని రంగంలోకి దింపిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆమెను ఒంటరిని చేశారని.. తన మాట కాదని స్రవంతికి టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవట్లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రచారానికి వచ్చినా.. పైసలు మాత్రం విదిల్చకపోవడంతో స్రవంతి అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఇతర పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న వారిని మాత్రం రేవంత్ రెడ్డి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తున్నది. డబ్బులు లేకపోయినా.. భవిష్యత్‌లో మనదే అధికారమని.. అప్పుడు తప్పకుండా న్యాయం చేస్తానని కొందరిని పార్టీలోనే కొనసాగేలా చేస్తున్నారు. పార్టీ సీనియర్లు గానీ, ఇతరులు ఎవరైనా చందాలు ఇస్తే ఒకటి రెండు రోజుల్లో కొంత మొత్తం సర్థుతానని స్రవంతికి చెప్పారని.. తన నుంచి మాత్రం పైసా ఆశించవద్దని రేవంత్ అన్నట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News