తెలంగాణలో బీజేపీ–జనసేన పొత్తు లేనట్టేనా..?
తెలంగాణలో సైతం పోటీచేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అక్కడ కూడా బీజేపీతో ఏమాత్రం సంప్రదించకుండానే 32 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు అంశం ఇప్పటికీ తేలలేదు. తాము బీజేపీతో కలిసే ఉన్నామని పవన్ కల్యాణ్ అంటూనే.. టీడీపీతో పొత్తును ఏకపక్షంగా ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కనీసం బీజేపీతో చర్చలు కూడా జరపకపోవడం గమనార్హం. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా కలిసిన పవన్ కల్యాణ్.. బయటికి రాగానే టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రకటించేశారు. ఆయన చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత కనీసం పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీతో మాట్లాడేందుకు ఏమాత్రం ఆలోచించకపోవడం గమనార్హం.
కానీ, బీజేపీతో కలిసే ఉన్నామనే పవన్ ఇప్పటికీ చెబుతున్నారు. మరోపక్క బీజేపీ ఏపీ నేతలు సైతం తాము ప్రస్తుతం జనసేనతో పొత్తులోనే ఉన్నామని, మున్ముందు అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని ప్రకటించారు. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం జనసేన తీరుపై ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం.
ఇదిలావుంటే.. తెలంగాణలో సైతం పోటీచేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అక్కడ కూడా బీజేపీతో ఏమాత్రం సంప్రదించకుండానే 32 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించేశారు. దానిపైనా బీజేపీ ఏమీ స్పందించలేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 52 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఖానాపూర్, జగిత్యాల, రామగుండం, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఇల్లందు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజానికి ఈ స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేసింది.
ఇకపోతే ప్రస్తుతానికి పది స్థానాలే అయినా మున్ముందు విడుదల చేసే బీజేపీ జాబితాలో.. ఇంకెన్ని జనసేన ప్రకటించిన స్థానాలు ఉంటాయోనన్న చర్చ మొదలైంది. బీజేపీ అభ్యర్థుల ప్రకటనతో జనసేన డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి విడుదలైంది ఫస్ట్ లిస్ట్ మాత్రమే. మిగతా చోట్ల అభ్యర్థులను ప్రకటించే క్రమంలో జనసేనతో చర్చలు జరుపుతుందా..? సీట్ల లెక్కలు తేల్చేస్తుందా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరికి వారే సీట్లు, సెగ్మెంట్లు ప్రకటించిన క్రమంలో.. పొత్తుల ఎత్తుగడ ఎటువైపు టర్న్ అవుతుందన్నది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.