51 తులాల గోల్డ్, 3 కోట్ల క్యాష్.. సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
నరేందర్ నివాసంలో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. ఇంట్లోనే దాదాపు రూ. 2 కోట్ల 93 లక్షల నగదును గుర్తించారు.
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్, అడిషనల్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కళ్లు బైర్లు కమ్మే సొమ్ము స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్‌పై నమోదైన అక్రమాస్తుల కేసులో భాగంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ సోదాల్లో నరేందర్ నివాసంలో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. ఇంట్లోనే దాదాపు రూ. 2 కోట్ల 93 లక్షల నగదును గుర్తించారు. ఇక బ్యాంకు ఖాతాలో రూ. కోటి 10 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు అతని భార్య, తల్లి పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. దాదాపు 51 తులాల బంగారం గుర్తించారు.
దాంతో పాటు 17 స్థిరాస్థులకు సంబంధించిన డాక్యూమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ ఏసీబీ అధికారుల స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ దాదాపు రూ. 6 కోట్లుగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నరేందర్‌ను అరెస్టు చేసిన అధికారులు.. ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు.