మోదీ ఫ్లెక్సీ ఏది..? కలెక్టర్‌పై చిందులు తొక్కిన నిర్మలా సీతారామన్..

రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత..? రాష్ట్రం వాటా ఎంత అంటూ కలెక్టర్‌ని ప్రశ్నించారు నిర్మలమ్మ. అంతే కాదు, అక్కడ మోదీ ఫ్లెక్సీ ఎందుకు లేదంటూ నిలదీశారు.

Advertisement
Update:2022-09-02 12:50 IST

బీజేపీ వారికి ప్రచార యావ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆఖరికి కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో కూడా ఇవి మోదీ ఇస్తున్న ఉచిత వ్యాక్సిన్లు అంటూ ప్రచారం చేసుకుంటారు బీజేపీ నేతలు. తాజాగా కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపుల వద్దకు వెళ్లారు. రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత..? రాష్ట్రం వాటా ఎంత అంటూ కలెక్టర్‌ని ప్రశ్నించారు నిర్మలమ్మ. అంతే కాదు, అక్కడ మోదీ ఫ్లెక్సీ ఎందుకు లేదంటూ నిలదీశారు. దీంతో అక్కడ రేషన్ బియ్యం కోసం వచ్చిన సామాన్య ప్రజలు నోరెళ్లబెట్టారు. ఫొటోల కోసం కేంద్ర మంత్రి కూడా ఇలా గొడవ చేస్తారా అని ఆశ్చర్యపోయారు. .

మోదీ ఫ్లెక్సీ ఏది..?

బియ్యాన్ని కేంద్రం ఉచితంగా ఇస్తోందని, కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా బియ్యం పంపిణీ చేసిందని, కానీ ఆ క్రెడిట్ అంతా రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో చేరిపోతోందంటూ అసహనం వ్యక్తం చేశారు నిర్మలమ్మ. కేంద్రం ఉచితంగా ఇస్తున్నందున అక్కడ ప్రధాని మోదీ ఫొటో పెట్టాలన్నారు. మోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలంటూ స్థానిక బీజేపీ నాయకులకు సూచించారు. ఆ ఫ్లెక్సీని ఎవరూ తొలగించకూడదని, అది చినగకూడదని, అలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ దేనని ఆదేశాలు కూడా ఇచ్చారు.

ప్రజలకు మేలా..? ప్రభుత్వానికి ప్రచారమా..?

ఈ మధ్య కేంద్రం సరికొత్త వాదన మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు వేరు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వేరు మా పథకాలకు మీ పేర్లు పెట్టుకోవడం ఏంటని నిలదీస్తోంది. కేంద్రం నిధులిచ్చే పథకాలను కేంద్ర పథకాల లాగానే ప్రచారం చేయాలని, ఆ క్రెడిట్ అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే రావాలని వాదిస్తోంది. పథకాల కోసం కేంద్రం ఖర్చు చేసే సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తే మాత్రం సమధానం ఉండదు. ఇలా రేషన్ షాపుల ముందు మోదీ ఫొటో లేదని కేంద్ర మంత్రి చిందులు తొక్కడం మాత్రం విచిత్రంగా తోస్తోంది.

Tags:    
Advertisement

Similar News