నిఖార్సైన నాయకుడు జైపాల్ రెడ్డి : వెంకయ్య నాయుడు
మాజీ మంత్రి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు.
దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నాయకులు, ప్రముఖులు నివాళి అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ కేంద్ర జానారెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వినోద్ కుమార్, మందుల సామేలు , కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరై పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతు జైపాల్‌రెడ్డి దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. తనకు జైపాల్ రెడ్డి పట్ల చాలా గౌరవం ఉండేదన్నారు. నిజాయతీ, నిఖార్సైన నాయకుడు జైపాల్ రెడ్డి అని చెప్పారు. ఆయనతో తనకు సత్సంబంధాలు ఉండేదని , చాలా విషయాల్లో తాము విభేదించుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు.
తను జైపాల్ రెడ్డి జూనియర్ కావడంతో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌లో ఆయన పోషించిన పాత్ర గొప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి చెప్పారు. జైపాల్ రెడ్డి చేవెళ్ల ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారని స్పీకర్ గడ్డం ప్రసాద్ గుర్తు చేశారు. వారు చూపించిన మార్గంలో నడవడానికి తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు జైపాల్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మరచిపోరని చెప్పారు. తమ ప్రాంతంలో ఉన్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం సంతోషకరమని స్పీకర్ పేర్కొన్నారు.