రుణమాఫీ మిత్తితో సహా కట్టేస్తాం
ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయిన తర్వాత నిధులకు కొరత ఉండదన్నారు మంత్రి కేటీఆర్. వడ్డించేటోడు మీ వ్యక్తి అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా మూలుగు బొక్క పడటం ఖాయమని చెప్పారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ గెలిస్తే ప్రతి గ్రామానికి నిధుల వరద పారుతుందన్నారు మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయిన తర్వాత నిధులకు కొరత ఉండదన్నారు. వడ్డించేటోడు మీ వ్యక్తి అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా మూలుగు బొక్క పడటం ఖాయమని చెప్పారు. ఫాల్తు గాళ్లు వచ్చి చెప్పే ఫాల్తు మాటలు నమ్మొద్దని, గల్లీతో సంబంధం లేనోడితో, ఢిల్లీ మాట వినేటోడితో పనులు కావు అని అన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తే మీకు ఏం ఢోకా ఉండదని, అన్ని సౌలత్ లు వస్తాయని, అన్ని పనులు జరుగుతాయని చెప్పారు కేటీఆర్. కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ లో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు.
కామారెడ్డికి కేసీఆర్ వస్తే దశాబ్దాల దరిద్రం మొత్తం రెండేళ్లలో పోతుందని ఎమ్మెల్యే గోవర్ధన్ అన్నారని, గోదావరి నీళ్లు వస్తాయి, ప్రతి ఊరికి నిధులు వస్తాయి, ప్రతి మండలంలో కాలేజీలు వస్తాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ ని ఇక్కడ పోటీ చేయాలని ఆహ్వానించారని చెప్పారు మంత్రి కేటీఆర్. సార్ దయ ఉంటే తనకు వేరే పదవి వస్తుందని, కానీ కామారెడ్డి బాగుపడాలని కేసీఆర్ ను ఆహ్వానించినట్టు గోవర్దన్ చెప్పారని తెలిపారు కేటీఆర్. మంచి మనసున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అని ప్రశంసించారు కేటీఆర్.
కరోనాతో రెండేళ్ల పాటు తెలంగాణకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పారు కేటీఆర్. అయినా కూడా రుణమాఫీ రూ.19 వేల కోట్లకు గాను రూ.14 వేల కోట్లు చేశామని చెప్పారు. ఇంకా రూ.5 వేల కోట్లు మిగిలిందని, అది కూడా బరాబర్ ఇచ్చే బాధ్యత తమదేనన్నారు కేటీఆర్. రూ.2 వేల కోట్లు మిత్తి పైసలు కూడా బరాబర్ కట్టించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.