ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బులు దండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం
ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ప్రజల నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టిన మాజీ మంత్రి
ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరుతో ప్రజల నుంచి రూ. 15 వేల కోట్లు ముక్కు పిండి వసూలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దీన్ని బీఆర్‌ఎస్ ఖండిస్తున్నట్టు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ప్రజల నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటు. కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నదని అన్నారు. గతంలో ఈ విషయంలో అడ్డగోలుగా విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలను కూడా హరీశ్ ప్రస్తావించారు. త్వరలో పుంజుకుంటుందని మంత్రి స్వయంగా చెప్పా రంటే ఇప్పటికే కుదేలైందనే కదా అర్థమని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించండి. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు.