కర్రలతో బీజేపీ.. రాళ్లతో కాంగ్రెస్
కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ప్రియాంకగాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిదూరు వ్యాఖ్యల పట్ల యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి దిష్టి బొమ్మను దగ్ధం చేసింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలవెరూ లేరు. కార్యకర్తలు మాత్రమే ఉండటంతో యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం వైపు దూసుకురావడంతో బీజేపీ కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు కూడా కర్రలతో బైటికి వచ్చి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. బీజేపీ కార్యాలయంలో ఉన్న దళిత మోర్చా కార్యకర్త తలకు గాయాలయ్యాయి. పోలీసులు భారీగా చేరుకుని ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నది. చివరికి పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.