నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు
పలు రైలు సర్వీసులను పెంచిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచి అమల్లోకి
ఎంఎంటీఎస్ సర్వీసులను మరింత చేరువ చేసే దిశగా సౌత్ సెంట్రల్ రైల్వే అడుగులు వేస్తున్నది. ఫలక్‌నుమా, మేడ్చల్, లింగంపల్లి, తెల్లాపూర్ మార్గాల్లో సర్వీసుల సంఖ్యను పెంచింది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సమయపాలనలోనూ సర్దుబాట్లు చేసింది. పీక్ అవర్స్‌లో ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉండేలా మార్పులు చేసింది. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. ప్రస్తుతం నగరంలోని 80 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉండగా.. ఫలక్‌నుమా, లింగంపల్లి, ఘట్‌కేసర్, మేడ్చల్ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి కొనసాగింపుగా పలు రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. ఇప్పటివరకు మేడ్చల్ మార్గంలో ఒకే సర్వీసు ఉండేది. ఫలక్‌నుమా, లింగంపల్లి మార్గంలో నడిచే రైళ్ల వేళల్లో మార్పులు చేసింది. దీంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు శివారు ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించేవారికి ప్రయాస తప్పినట్టయ్యింది.