మెదక్ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు
వందేళ్లు పూర్తి చేసుకున్నమెదక్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామన్న సీఎం
వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు విజ్ఞప్తి మేరకు మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడి వచ్చాను. సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం వివరించారు.