రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి
అన్ని ప్రాజెక్టులను పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నట్లు తెలిపిన ఉత్తమ్
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ. 37 కోట్లు విడుదల చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వారంలో మరో రూ. 22 కోట్లు విడుదల చేస్తామన్నారు. మరో రూ. 13 కోట్లు విడుదల చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందు మెయిన్ కాలువలు పూర్తి చేస్తామన్నారు. కాలువలు పూర్తి చేయడానికి భూసేకరణ చేయడానికి ఈమధ్యే రూ. 70 కోట్లు విడుదల చేశామన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులంతా భూసేకరణకు సహకరించాలని మంత్రి కోరారు. పదేళ్లుగా ఇరిగేషన్ శాఖలో నియామకాలు లేవన్న మంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 700 మంది ఇరిగేషన్ శాఖలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.అన్ని ప్రాజెక్టులను పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకుని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్ కాల్వకు రూ. 120 కోట్లు మంజూరు చేశామని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు.