మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి

సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించిన కేంద్ర మంత్రి

Advertisement
Update:2024-11-15 14:00 IST

తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్‌ టూరిజం ప్లాజాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రజలకు ఒనగూరేదేమీ లేదన్నారు. మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి అన్నట్లు కేసీఆర్‌ మాదిరిగానే రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అశోక్‌నగర్‌ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇంకా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించలేదన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో విఫలమైమందన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు.

బోనస్‌ అని.. బోగస్‌ మాటలు చెప్పి కాంగ్రెస్‌ గెలిచింది. ఓవైసీ కనుసన్నల్లోనే పోలీస్‌ నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ చర్యల వల్ల కలెక్టర్‌పై దాడి జరగేలా చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ ఏకైక ఏటీఎం సెంటర్‌గా తెలంగాణ ఉందన్నారు. మూసీ పునరుజ్జీవానికి ప్రతిపక్షాలు అడ్డొస్తున్నాయని సీఎం ఆరోపించారు. కానీ మూసీ పునర్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. మూసీ అభివృద్ధి కార్యాచరణ, డీపీఆర్‌ లేదన్నారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూలుస్తూ.. నల్గొండ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చొద్దు అంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తానని సీఎం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం చావడానికైనా సిద్ధమన్నారు. సీఎం సవాల్‌ణు స్వీకరిస్తున్నాం. రేపు పేదల ఇళ్లలో మూసీ పక్కనే నిద్రిస్తామన్నారు. పేదల ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తాము మద్దతిస్తామన్నారు. కేటీఆర్‌ అరెస్టు కాకుండా బీజేపీ అడ్డుకుంటున్నదనేది దుష్ప్రచారమే అన్నారు. గవర్నర్‌ ఏ సంతకం పెడుతున్నారని కేంద్రం పర్యవేక్షిస్తుందా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ కేంద్రంలో ఎవరినీ కలవలేదన్నారు. 

శిల్పకళావేదికలో ఈ నెల 21 నుంచి 24 వరకు లోక్‌ మంథన్‌

శిల్పకళావేదికలో ఈ నెల 21 నుంచి 24 వరకు లోక్‌ మంథన్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఏడాదిలో అంత్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్‌మంథన్‌ను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 22 న లోక్‌మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే 24న జరిగే ముగింపు కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, విదేశీ అతిథులు హాజరవుతారని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News