తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే
నేడు రాష్ట్రంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, వికారాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో శుక్రవారం మధ్యాహ్నం నుంచే పలుచోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులుపడ్డారు. అలాగే భారీ వరదలు రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో రాత్రి భారీ వర్షం పడింది. భారీ వర్షానికి బడా భీంగల్ గ్రామంలో రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పలు ఇండ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. భీంగల్ వెళ్లే దారిలో చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం కూడా తెల్లవారుజాము నుంచే వర్షం మొదలైంది. పలుచోట్ల వాన పడుతున్నది.