రేషన్ కార్డులు, రైతు భరోసా.. కమిటీలతో కాలయాపన ఎందుకు..?

రేషన్ కార్డ్ ల కోసం ఏకంగా ఓ కమిటీ వేశారు. అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల తర్వాత.

Advertisement
Update:2024-08-09 07:43 IST

తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయింది. ఆరు గ్యారెంటీల గురించి మాత్రం ప్రభుత్వం పెద్దగా స్పందించడంలేదు. ఆ గ్యారెంటీలన్నిటికీ రేషన్ కార్డ్ తో ముడిపెట్టడంతో వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. పోనీ కొత్త రేషన్ కార్డ్ లు ఇస్తున్నారా అంటే అదీ లేదు. రేషన్ కార్డ్ ల కోసం ఏకంగా ఓ కమిటీ వేశారు. అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల తర్వాత.

కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి అర్హతలు, విధి విధానాల రూపకల్పనకు ముగ్గురు మంత్రులతో కేబినెట్‌ సబ్‌కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌ గా వ్యవహరిస్తారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందులో సభ్యులు. కొత్త కార్డులు ఇవ్వడానికి విధి విధానాలు వీరు ఖరారు చేస్తే ఆ తర్వాత వాటి సంగతి తేలుస్తారు. అయితే ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలందరి నుంచి తీసుకున్న ప్రజా పాలన దరఖాస్తుల సంగతేంటి..? అనేది తేలాల్సి ఉంది. వాటిని ఆన్ లైన్ చేయడంలో డొల్లతనం అప్పట్లోనే బయటపడింది. ఇప్పుడు కొత్త కమిటీ విధి విధానాలు ఖరారు చేస్తే తిరిగి కొత్తగా రేష్ కార్డులకోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించే అవకాశముంది.

రైతుభరోసా ఏది..?

రైతుబంధు పేరుదో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు అవసరాలకోసం ఆర్థిక సాయం చేసింది. అయితే కొత్త ప్రభుత్వం ఇంతవరకు రైతుబంధు పేరెత్తలేదు. రైతు భరోసాగా దాన్ని మార్చి కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా న్యాయం చేస్తామంటున్నారే కానీ చేతలు ముందుకు సాగడంలేదు. పెద్ద పెద్ద భూస్వాములను ఏం చేయాలి..? ఐటీ రిటర్న్స్ కట్టేవారికి కూడా రైతు భరోసా ఇవ్వాలా..? అనే చర్చతోనే 8 నెలలు గడిచిపోయాయి. ఈలోగా రైతు రుణమాఫీ చేసి మమ అనిపించారు. అది కూడా సవ్యంగా జరగలేదనే ఆరోపణలున్నాయి. మొత్తంగా కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా విషయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోంది. కేబినెట్ కమిటీలు, అభిప్రాయ సేకరణ అంటూ కాలం గడుపుతోంది. 

Tags:    
Advertisement

Similar News