కుమారి ఆంటీతో పోలిక.. కాంగ్రెస్ కి కొత్త తలనొప్పి
కుమారి ఆంటీ సమస్య పట్టించుకుంటారు కానీ మమ్మల్ని పట్టించుకోరా అంటూ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వ్యవహారంలో కాస్త కనికరం చూపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో సమస్యలన్నిటినీ కుమారి ఆంటీ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఫుడ్ స్టాల్ తరలింపుని ఆపడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపించిన చొరవ, తమ సమస్యల పరిష్కారంలో కూడా చూపెట్టాలంటూ నిలదీస్తున్నారు బాధితులు.
కుమారి ఆంటీ సమస్య పట్టించుకుంటారు కానీ మమ్మల్ని పట్టించుకోరా అంటూ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వానికి కుమారి ఆంటీ విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని వారు విమర్శించారు. యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు.
ఇక ఆటో డ్రైవర్ల సమస్యని కూడా హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆటో డ్రైవర్ల సమస్య గురించి పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి, రోడ్డు పక్కన ఒక చిన్న ఫుడ్ స్టాల్ వ్యవహారంపై ఎందుకంత ఆసక్తి చూపించారని అటు బీఆర్ఎస్ నేతలు కూడా నిలదీస్తున్నారు. ఫుడ్ స్టాల్ విషయంలో చూపించిన చొరవ, మిగతా సమస్యల పరిష్కారంలో కూడా చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తమ్మీద కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని పోలీసులు తరలిస్తున్నారని తెలియగానే తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఆ వేగమే ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది. మా సంగతేంటని.. మిగతావారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.