మునుగోడు ఓట్ల కోసం సీఎం కేసీఆర్ అదిరిపోయే వ్యూహం

ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చార్జ్ షీట్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో వీటికి చెక్ పెట్టేలా సీఎం కేసీఆర్ అదిరిపోయే వ్యూహం సిద్ధం చేశారు.

Advertisement
Update:2022-10-10 14:40 IST

మునుగోడు ఉపఎన్నికను సీఎం కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో గెలుపు కోసం అన్ని దారులను అన్వేషిస్తున్నారు. టీఆర్ఎస్ పేరు మీదనే పోటీ చేస్తున్నా.. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ప్రభావం బీఆర్ఎస్‌పై పడుతుందని, ప్రతిపక్షాలకు అనవసరమైన ఆయుధాలు ఇచ్చినట్లు అవుతుందని అధినేత భావిస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే మునుగోడులో క్యాంపు వేసి తమకు అప్పగించిన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ఓ గ్రామానికి ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మరోసారి బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో కూడా ఉన్నారు.

ఇన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం సంతృప్తి చెందడం లేదు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చార్జ్ షీట్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో వీటికి చెక్ పెట్టేలా సీఎం కేసీఆర్ అదిరిపోయే వ్యూహం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు మునుగోడులో కూడా ఉన్నారు. ఆ సెగ్మెంట్‌లో దాదాపు 3.34 లక్షల మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యాయి. ఇప్పుడు వారందరికీ సీఎం కేసీఆర్ స్వయంగా లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్‌ ఇలాగే ప్రతీ లబ్దిదారునికి తాము అందుకున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ లేఖలు పంపించారు. ఇవి ప్రభుత్వానికి చాలా ఉపయోగకరంగా మారాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్ బాటను అనుసరించబోతున్నారు.

మునుగోడు నియోజకవర్గ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, పంటల రుణ మాఫీ, గొర్రెల పంపిణీ, సీఎం రీలీఫ్ ఫండ్, కేసీఆర్ కిట్లు తదితర సంక్షేమ ఫలాలు పొందిన వారికి సీఎం సంతకాలు చేసిన లేఖలు పంపనున్నారు. కేసీఆర్ స్వయంగా లేఖలు పంపితే కొంత మంది అయినా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని పార్టీ నాయకులు అంటున్నారు.ఈ లేఖలు తప్పకుండా మరికొన్ని ఓట్లు సంపాదించి పెడతాయని, అదే సమయంలో ప్రతిపక్షాలు ఆరోపణలకు కూడా సరైన జవాబిచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. గత ఎనిమిదేళ్లలో మునుగోడులో దాదాపు 3.34 లక్షల లబ్దిదారులకు రూ. 10,260 కోట్ల విలువైన సాయం అందింది. కేసీఆర్ వల్లనే వీరికి ఇన్ని సంక్షేమ ఫలాలు అందాయని గుర్తు చేయడం మంచి పనే అని పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నట్లు లేఖలో పొందుపర్చనున్నారు.

Tags:    
Advertisement

Similar News