టీఆర్ఎస్ పేరుతో చీప్ ట్రిక్స్.. తెరపైకి కొత్త పార్టీ

ఎన్నికల వేళ, ఆశావహులకు టికెట్ల పేరుతో గాలం వేసి సొమ్ము చేసుకునేందుకే ఈ కొత్తపార్టీ పనికొస్తుందనే ప్రచారం జరుగుతోంది. TRS పేరుని వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలు నెరవేరవని అప్పుడే సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలయ్యాయి.

Advertisement
Update:2023-03-04 20:00 IST

తెలంగాణ రాష్ట్ర సమితి(TRS), భారత్ రాష్ట్ర సమితి(BRS)గా మారిన తర్వాత BRS అనే పేరు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అయితే TRS ని కూడా ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ఆ లాజిక్ తోనే ఇప్పుడు కొత్త పార్టీ తెలంగాణలో పుట్టుకొస్తోంది. తెలంగాణ రాజ్య సమితి(TRS) అనే పేరుతో ఈ పార్టీని రిజిస్టర్ చేసినట్టు, త్వరలోనే బహిరంగ ప్రకటనతో ఈ పార్టీ జెండా, అజెండాని జనంలోకి తీసుకు రాబోతున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇదో పెను సంచలనం అంటూన్నారు కూడా. అయితే ఈ డూప్ షాట్ రాజకీయాలు ఎక్కువకాలం చెల్లవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం TRS పేరుని వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలు నెరవేరవని అప్పుడే సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలయ్యాయి.

నాయకులెవరు..?

కొత్తగా వస్తున్న తెలంగాణ రాజ్యసమితి అధినాయకులెవరనేది ఇంకా బయటకు రాలేదు. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను పోగేసి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారట. సరిగ్గా ఎన్నికల ఏడాదిలో వస్తున్న ఈ పార్టీ టార్గెట్ ఏంటనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. తెలంగాణలో ఇప్పటికే నెంబర్ 2 మేమంటే మేమంటూ కాంగ్రెస్, బీజేపీ కీచులాడుకుంటున్నాయి. ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. ఈమధ్య కొత్తగా వైఎస్సార్టీపీ పేరుతో వైఎస్ షర్మిల కూడా హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ పార్టీ వీటి మధ్య ఎలా ఇమడగలుగుతుందో చూడాలి. ఎన్నికల వేళ, ఆశావహులకు టికెట్ల పేరుతో గాలం వేసి సొమ్ము చేసుకునేందుకే ఈ కొత్తపార్టీ పనికొస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఆ ఘనత కేసీఆర్ దే..

కేసీఆర్ కి ముందు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు జరిగాయి. కానీ కేసీఆర్ మాత్రమే తెలంగాణ సాధించగలిగారు. ప్రజలకు ఆ విషయం బాగా తెలుసు. ఉద్యమంలో కలసి నడిచి, ఆ తర్వాత కేసీఆర్ తో విభేదించిన కోదండరాం వంటి నాయకులు కొత్త పార్టీలు పెట్టినా అందుకే ప్రయోజనం కనపడలేదు. తాజాగా టీఆర్ఎస్ పేరుతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొత్త పార్టీ వచ్చినా, ఉద్యమం పేరు చెప్పుకుని కొత్త పార్టీ పేరుతో ఎవరైనా రాజకీయాలు చేయాలని చూసినా.. తెలంగాణ ప్రజలు విశ్వసించరని అంటున్నారు. కార్యసాధకుడు కేసీఆర్ మాత్రమేననేది తెలంగాణ ప్రజల నమ్మకం.

Tags:    
Advertisement

Similar News