నాలాలకు సెన్సర్లు.. ముంపు నియంత్రణకు GHMC నయాప్లాన్
వరదల విషయంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది GHMC. మెయిన్ నాలాల్లో సెన్సర్ల ఏర్పాటు, వరద ప్రవాహం అంచనా, జల వనరుల మ్యాపింగ్ ఈ ప్లాన్‌లో ప్రధానమైనవి.
హైదరాబాద్‌లో ముంపు ప్రాంతాలను అలర్ట్ చేసే విధంగా GHMC ఇంజినీరింగ్ విభాగం కొత్త ప్లాన్ రూపొందించింది. సిటీలోని చెరువులు, నాలాల పక్కనున్న లోతట్టు ప్రాంతాల్లో కొత్తగా నాలాలు నిర్మించి, పాత నాలాలకు మరమ్మతు చేయనున్నారు సిబ్బంది. ఇక అవసరమైన చోట సెక్యూరిటీ వాల్స్ నిర్మించనున్నారు.
వరదల విషయంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది GHMC. మెయిన్ నాలాల్లో సెన్సర్ల ఏర్పాటు, వరద ప్రవాహం అంచనా, జల వనరుల మ్యాపింగ్ ఈ ప్లాన్‌లో ప్రధానమైనవి. దేశవ్యాప్తంగా పలు నగరాలకు రూ.250 కోట్ల చొప్పున నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులు అందించనుంది. ఈ నిధులను వినియోగించుకునేందుకు బల్దియా ప్లాన్ రెడీ చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వరదలను తగ్గించే చర్యల్లో భాగంగా జనాభా 50 లక్షలకు మించిన 7 నగరాలను NDMA గుర్తించింది. ఆయా నగరాలకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 250 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిటీలో వరద నివారణ చర్యల ప్లాన్ ఇవ్వాలంటూ GHMCని కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు GHMC సైతం స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ ఫస్ట్‌ఫేజ్‌లో భాగంగా రూ. 985 కోట్లతో నాలాలను నిర్మిస్తోంది. ఇదే సమయంలో కేంద్ర సంస్థ ఆర్థిక సాయం చేస్తాం.. ప్లాన్ ఇవ్వాలని కోరింది. దీంతో తర్వాతి దశలో చేపట్టే పనులకు కేంద్ర నిధులను వినియోగించుకోవాలని GHMC అధికారులు నిర్ణయించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇచ్చే నిధులతో ఎల్బీనగర్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో చెరువులను కలిపే పలు ప్రధాన నాలాలు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు చేయనున్నట్లు తెలిపారు.