తెలంగాణ పోలీస్ మరో ముందడుగు..

కొత్త పేర్లతో సంస్థలను ఏర్పాటు చేయడంతో సరిపెట్టకుండా అదనపు బలగాలతో వాటిని పటిష్టం చేస్తున్నారు. ఈ బ్యూరోల కోసం దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించారు.

Advertisement
Update:2023-06-01 06:33 IST

నేర నియంత్రణలో దేశంలోనే ముందు వరుసలో ఉన్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మరింత పటిష్టంగా మారబోతోంది. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది . డ్రగ్స్ నియంత్రణకోసం తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (TSNAB), సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో ఈ రెండు సంస్థలకు చెందిన బ్యూరోలు ఉంటాయి. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, డీజీపీ అంజనీ కుమార్.. వీటిని ప్రారంభించారు.

అదనపు బలగాలతో పటిష్టం..

కొత్త పేర్లతో సంస్థలను ఏర్పాటు చేయడంతో సరిపెట్టకుండా అదనపు బలగాలతో వాటిని పటిష్టం చేస్తున్నారు. ఈ బ్యూరోల కోసం దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించారు. పెరుగుతున్న సైబర్‌, మాదకద్రవ్యాల నేరాల నియంత్రణకు ఈ బ్యూరోల ద్వారా అడ్డుకట్ట పడుతుందన్నారు మంత్రులు. చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారానే ఈ నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. బ్లాక్‌ మెయిల్‌ చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించే సైబర్‌ నేరగాళ్లపై హత్యకేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన బ్యూరోల పనితీరు నేరగాళ్లలో భయం పుట్టించాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనతో ఈ బ్యూరోల కసరత్తు ప్రారంభమైందని చెప్పారు.

సాంకేతికత ఆధారంగా..

ఆధునిక సాంకేతికత ఆధారంగా సవాల్ తో కూడుకున్న ఎన్నో కేసులను పరిష్కరించగలిగామని, అదే సాంకేతికతతో ఈ రెండు బ్యూరోల ద్వారా మరో ముందడుగు వేస్తున్నామని తెలిపారు డీజీపీ అంజనీకుమార్. మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు రాష్ట్ర పరిధిలో TSNAB పనిచేస్తుందన్నారు. ఇకపై ఈ కేసులన్నీ TSNABకి బదిలీ అవుతాయన్నారు. ఇక సైబర్ నేరాలను అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక విభాగం ఉన్నా.. అధికారికంగా ఇక ఆ కార్యాకలాపాలన్నీ TSCSB చూస్తుందని వివరించారు. 

Tags:    
Advertisement

Similar News