కాంగ్రెస్‌లో చేరికల కాక.. సీనియర్లు వర్సెస్‌ జూనియర్స్

రాష్ట్రంలో ఎలక్షన్‌ ఫీవర్‌ స్టార్ట్‌ కావడంతో కాంగ్రెస్‌లో చేరికలు ఊపందుకున్నాయి. అయితే పార్టీలోకి చేరికలతో పాత వారిలో ఆందోళన మొదలైంది.

Advertisement
Update:2023-10-07 10:47 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్తనేతల చేరికలు కాక రేపుతున్నాయి. చేరికలతో ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఈ అసమ్మతి ఎలక్షన్ టైమ్‌లో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. హస్తం పార్టీలో చేరిన కొత్త నేతలు, నియోజకవర్గ స్థాయి నేతలతో కలిసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పార్టీకి నష్టం తప్పదని పలువురు సీనియర్ల హెచ్చరిస్తున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు తెలంగాణలో ఆ పార్టీకి కొత్త ఊపిరిలూదినట్లయింది. దీంతో పార్టీ క్రమంగా బలపడుతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వం సైతం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ వచ్చింది. యూత్‌, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లు ప్రకటించడం, చేయూత పెన్షన్‌లు, ఆరు గ్యారెంటీలు హస్తం పార్టీకి బలం చేకూర్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు బలాన్ని చేకూర్చాయి. దీంతో క్షేత్రస్థాయిలో హస్తం పార్టీ పుంజుకుంది. బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు హస్తం వైపు మొగ్గు చూపారు. మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు.. ఆసక్తి చూపినా ప్రజల్లో వారిపై ఉన్న వ్యతిరేకత కారణంగా నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

రాష్ట్రంలో ఎలక్షన్‌ ఫీవర్‌ స్టార్ట్‌ కావడంతో కాంగ్రెస్‌లో చేరికలు ఊపందుకున్నాయి. అయితే పార్టీలోకి చేరికలతో పాత వారిలో ఆందోళన మొదలైంది. డీసీసీ అధ్యక్షులకు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు తెలియకుండా హస్తం పార్టీలో కొత్తవారు చేరుతుండటంతో ఆందోళనకు కారణమవుతోంది. టికెట్‌ దక్కుతుందో లేదోనని సీనియర్లలో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కొత్త నేతలు పాతవారితో కలిసిపోకవపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు సీనియర్లు. మైనంపల్లి చేరికతో మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ పార్టీని వీడారు. ఆ ఇద్దరూ టికెట్లు తమకే వస్తాయని ఆశించి భంగపడ్డారు. దీంతో హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

అయితే ఎన్నికల టైమ్‌లో నాయకుల జంపింగ్‌లు సర్వసాధారణమైనప్పటికీ.. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం అలర్ట్ కావాల్సిన పరిస్థితులున్నాయి. అసమ్మతి రాకుండా కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కుదుర్చాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే టికెట్ల ప్రకటన వచ్చిన మరుక్షణమే అసమ్మతి చెలరేగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్న సీనియర్లు.

Tags:    
Advertisement

Similar News